జగన్ మళ్లీ జైలుకెళ్లే సమయం వచ్చింది- మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసిన అవినీతిని వెలికితీస్తాం. మాచర్లలో నరమేధం సృష్టించారు.

జగన్ మళ్లీ జైలుకెళ్లే సమయం వచ్చింది- మంత్రి సంచలన వ్యాఖ్యలు

Minister Ram Prasad Reddy : టీడీపీకి ఓటు వేయని వారిపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, ఆస్తుల విధ్వంసంతో ఏపీని రావణ కాష్టం చేస్తున్నారని, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రులు ఎదురుదాడికి దిగారు. జగన్ పై నిప్పులు చెరిగారు.

రవాణశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మళ్లీ జైలుకి వెళ్లే సమయం వచ్చిందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలే నేడు వెంటాడుతున్నాయని చెప్పారు. 21 రోజుల్లోనే.. చంద్రబాబు ఏమీ చేయలేదని జగన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని జగన్ ను నిలదీశారు. వాలంటీర్లతో వైసీపీ నేతలు ఊడిగం చేయించుకున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు.

”ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసిన అవినీతిని వెలికితీస్తాం. వైసీపీ నేతలపై కక్ష సాధించే ఆలోచన టీడీపీకి లేదు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందే. ఐదేళ్లలో మాచర్లలో నరమేధం సృష్టించారు. తోట చంద్రయ్య లాంటి టీడీపీకి చెందిన బీసీ నాయకుడిని నడిరోడ్డుపై నరికి చంపారు.

అటు.. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. జగన్ ఆరోపణలను ఖండించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రికార్డెడ్ గా కేసు నమోదైందన్నారు. 25లక్షలు ఖర్చు పెట్టి మరీ మాజీ సీఎం ఓ ఖైదీని పరామర్శించారని విమర్శించారు. ములాఖత్ కు టైమ్ అయిపోయినా మాజీ సీఎం అడగటంతో అనుమతి ఇచ్చామన్నారు. గలాటా సృష్టించాలని జగన్ చూస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ దాడులు చేసినట్లు ఆధారాలు ఉన్నాయా? అని జగన్ ను ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చటంతో పాటు దాడులు చేసిందే వైసీపీ అని ఎదురుదాడికి దిగారు. తనపై అట్రాసిటీ సహా 23 కేసులు పెట్టారని తెలిపారు.

Also Read : పిన్నెల్లి ఏమైనా గాంధీ మహాత్ముడా?: వైఎస్ జగన్‌కు టీడీపీ నేత ప్రశ్న