ఎమ్మెల్యే వర్సెస్ మాజీ డిప్యూటీ సీఎం మధ్య రచ్చ..!
ఈ పోస్టులు చూసిన వారు.. ఇదేం మాస్ రచ్చ అంటూ గుసగుసలాడుకుంటున్నారు.

TDP-YCP
ఆ గిరిజన నియోజకవర్గంలో ఓ ఇద్దరి మహిళా నేతల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతున్నాయి. ఒకరేమో మాజీ..మరొకరేమో తాజా ఎమ్మెల్యే. వీరిద్దరి మధ్య జరుగుతున్న పొలిటికల్ కామెంట్స్ కాకరేపుతున్నాయి. నీ సంగతి తేలుస్తా అంటూ ఒకరు మాస్ వార్నింగ్ ఇస్తుంటే..నీకంత సీన్ లేదంటూ మరొకరు మాటల మంటలు రేపుతున్నారు.
నువ్వు తిన్నది కక్కిస్తా అంటూ ఈమె..ముందు విషయం తలకెక్కించుకో అంటూ ఆమె పంచ్ డైలాగ్స్ తో సవాళ్లు విసురుకుంటున్నారు. అసలు వీరి మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ కు ఆజ్యం పోసిందెవరు? దానికి దారితీసిన కారణాలేంటి? మన్యం జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తున్న ఆ మహిళా నేతలెవరు? వాచ్ దిస్ స్టోరీ.
పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో పొలిటికల్ వార్ కాకరేపుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అయిన తోయిక జగదీశ్వరి, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణిల మధ్య మాటల యుద్ధం పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత..అన్నట్లుగా వీరిద్దరి మధ్య రాజకీయ రగడ చెలరేగుతోంది.
విమర్శకు ప్రతి విమర్శ, ఆరోపణలకు ప్రత్యారోపణలతో ఇద్దరి మధ్య పొలిటికల్ పంచ్ లు టపాసుల్లా పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ ప్రస్తుతం మన్యం జిల్లాలో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ ఇద్దరు నేతలు బహిరంగ విమర్శలు, ఆరోపణలతో సవాళ్లు విసురుకుంటుండటం హాట్ టాపిక్ గా మారింది. నిన్న మొన్నటి వరకు ఎవరి పని వారు చేసుకుంటూ పోయిన ఈ ఇద్దరు నేతలు..ఉన్నట్టుండి వీరి మధ్య ఈ రాజకీయ వివాదం ఎందుకు చెలరేగింది? ఎవరు ఆజ్యం పోశారన్న ప్రశ్నలు ప్రస్తుతం ఆ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
మొన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క..
నిన్న మొన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క.. తన జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూనే, దూకుడు పెంచారట ఎమ్మెల్యే జగదీశ్వరి. ఒకపక్క విపక్షాలకు కౌంటర్ ఇస్తూనే మరోపక్క నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారంట. తనపై తప్పుడు ప్రచారం చేసే వైసీసీ శ్రేణులను సైతం వదలకుండా కేసుల వరకు లాగే ప్రయత్నం చేస్తూ దూకుడు పెంచారట. ఇదంతా మంత్రి గుమ్మడి సంద్యారాణి డైరెక్షన్ లోనే జరుగుతుందన్న టాక్ జిల్లా రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. వైసీపీ నుంచి విమర్శల దాడిని తట్టుకునేలా మంత్రి సంద్యారాణి అండదండలతో, ఆమె కనుసన్నల్లోనే ఎమ్మెల్యే నడుస్తున్నారన్న చర్చ నడుస్తోంది.
అయితే, తానేమీ తక్కువ కాదు అన్నట్లు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారట. నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగదీశ్వరి ఏ చిన్న తప్పటడుగు వేసినా తన సోషల్ మీడియా వేదికగా రచ్చకెక్కించే ప్రయత్నంలో ఉన్నారట. ఓ భూ వివాదంలో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఫైర్ అయిన ఎమ్మెల్యే వైసీపీ నేతలపై కేసులుపెట్టేవరకు వెళ్లడంతో ఇద్దరి మధ్య ఓ రేంజ్ లోనే రచ్చ జరిగిందట.
ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం కురుపాం నియోజకవర్గంలో పలు అభివ్రద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హైజరైన మంత్రి గుమ్మడి సంద్యారాణి..గత వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై కూడా విమర్శలు చేశారట. దానికి పుష్ప శ్రీవాణి కూడా కౌంటర్ ఇచ్చారంట. దీంతో ఈ వివాదం మరింత రాజుకొని..ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారింది. పుష్పశ్రీవాణి చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఘాటుగానే రిప్లై ఇవ్వడంతో పాటు, తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా బయటపెట్టే ప్రయత్నం చేశారట ఆమె.
ఎమ్మెల్యే జగదీశ్వరి లేవనెత్తిన ప్రతీ అంశంపైనా, సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెడుతూ తన పవర్ పాలిటిక్స్ ను ప్రెజెంట్ చేస్తున్నారట పుష్పశ్రీవాణి. ఈ పోస్టులు చూసిన వారు.. ఇదేం మాస్ రచ్చ అంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఘటనలు జరగడం, మరోపక్క విమర్శలు, ఆరోపణలతో ఈ ఇద్దరు నేతలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు. వీరి మధ్య నెలకొన్న పొలిటికల్ ఫైట్ రాబోయే రోజుల్లో ఎటువైపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.