వైసీపీకి షాక్.. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా.. కీలక వ్యాఖ్యలు

టీడీపీలో చేరుతున్నానని, ఇందులో దాపరికం లేదని తెలిపారు. రాజకీయాల్లో పార్టీలు..

వైసీపీకి షాక్.. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా.. కీలక వ్యాఖ్యలు

రాజ్యసభ పదవులకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశామని తెలిపారు. తనకు మరో నాలుగేళ్లు, మోపిదేవికి రెండేళ్లు సభ్యత్వం మిగిలి ఉండగానే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశామని బీద మస్తాన్ రావు అన్నారు.

తమ రాజీనామా వెనుక ఎటువంటి ప్రలోభాలు లేవని, స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామని తెలిపారు. ఇంతకాలం పార్టీలో గౌరవం అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నపుడు ఎవరెవనో కలుస్తామని, గతంలో చంద్రబాబు తమ బాస్ అని అన్నారు. మళ్లీ అవకాశం వస్తే రాజ్యసభకు వస్తానని తెలిపారు.

వైసీపీలో 100 శాతం సహకరించారు: మోపిదేవి
మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. తాను టీడీపీలో చేరుతున్నానని, ఇందులో దాపరికం లేదని తెలిపారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమేనని, జగన్ తనకు వైసీపీలో 100 శాతం సహకరించారని అన్నారు. కొన్ని సందర్భాలు, అంశాల్లో విభేదాలు వచ్చాయని, కాబట్టి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తనను పరిగణనలోకి తీసుకోలేదని, అప్పుడే పార్టీని వీడాలని అనుకున్నానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుండా మరొకరికి టికెట్ ఇచ్చినప్పుడు పార్టీ క్యాడర్ వ్యతిరేకత వ్యక్తం చేసిందని చెప్పారు. అధికారం లేదు కాబట్టి పార్టీ మారుతున్నారని కొందరు అంటున్నారని, కానీ ఇంతకు ముందే పార్టీ మారాలనుకున్నామని స్పష్టం చేశారు. పార్టీ మారడం వల్ల తన గౌరవం, మర్యాదలు తగ్గుతాయో.. పెరుగుతాయో ప్రజల్లోనే తేల్చుకుంటానని చెప్పారు.

Also Read: వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు మిగిలేలా లేరు.. గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు