Crime News: మహిళకు డెడ్ బాడీ పార్సెల్ కేసులో వెలుగు చూస్తున్న నిజాలు
శ్రీధర్ వర్మే పర్లయ్యను హత్య చేశాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Crime
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి అనే మహిళ ఇంటికి పార్సెల్‌లో గుర్తుతెలియని మృతదేహం వచ్చిన కేసులో పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టారు. ఇప్పటికే పోలీసులు అనుమానిత నిందితుడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
బర్రె పర్లయ్యను హత్య చేసి బాక్స్‌లో ప్యాక్ చేశాడని అనుమానిస్తున్న శ్రీధర్ వర్మ ఇంట్లో మరో చెక్కపెట్టె, ప్యాకింగ్ కవర్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చెక్కపెట్టె, ప్యాకింగ్ కవర్స్‌ను అనుమానిత నిందితుడు ఎవరి కోసం సిద్ధం చేశాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
శ్రీధర్ వర్మే పర్లయ్యను హత్య చేశాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అత్యంత కిరాతకంగా పర్లయ్యను హత్య చేసి ప్యాక్ చేసిన శ్రీధర్ వర్మను బహిరంగంగా ఉరి తీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, అనుమానిత నిందితుడిని పోలీసులు మచిలీపట్నం-బంటుమిల్లి సమీపంలో అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే. తులసికి పార్సెల్‌లో వచ్చిన మృతదేహం కాళ్ల మండలం గాంధీనగర్‌కు చెందిన బర్రె పర్లయ్యదిగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు.
సాగి తులసి చెల్లెలి రేవతి భర్త తిరుమాని శ్రీధర్ వర్మ రెండు మూడు రోజులు పరారీలో ఉండి చివరకు పోలీసులకు దొరికిపోయాడు. అతడు ఈ హత్య ఎందుకు చేశాడో, పార్సెల్‌ను తులసికి ఎందుకు పంపాడో తెలియరాలేదు.