మరో శుభవార్త : ఏపీతో మరో 2 దిగ్గజ కంపెనీల ఎంఓయూ

  • Published By: bheemraj ,Published On : August 20, 2020 / 05:04 PM IST
మరో శుభవార్త : ఏపీతో మరో 2 దిగ్గజ కంపెనీల ఎంఓయూ

Updated On : August 20, 2020 / 5:15 PM IST

ఏపీతో మరో 2 దిగ్గజ కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ‘‘వైయస్సార్‌ చేయూత’’ద్వారా మహిళా సాధికారికతకు మరో 2 దిగ్గజ కంపెనీలు తోడ్పాటు అందించనున్నాయి. ఏపీ ప్రభుత్వంతో రిలయన్స్‌ రిటైల్‌– జియో, అల్లాన కంపెనీల అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. మహిళా సాధికారిత కోసం చేయూత కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం జగన్ తెలిపారు.

స్థిరమైన జీవనోపాధి వారికి కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చేయూత పథకం ద్వారా వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన 45– 60 ఏళ్ల మధ్యనున్న మహిళలకు చేయూత ద్వారా సహాయం అందించామని పేర్కొన్నారు. సంతృప్త స్థాయిలో పథకాన్ని వారికి అమలు చేశామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు చేయూతను అందించామని వెల్లడించారు.

నాలుగేళ్లపాటు క్రమం తప్పకుండా, స్థిరంగా వారికి రూ.18,750లు ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన వారిందరికీ కూడా ఏడాదికి రూ.18,750లు చొప్పున నాలుగేళ్లలో రూ.75వేలు ఇస్తున్నామని వెల్లడించారు. 23 లక్షల మంది మహిళలకు సుమారు రూ.4,300 కోట్లు ఇచ్చామని తెలిపారు. వచ్చే నెల ఆసరాను ప్రారంభిస్తున్నామన్నట్లు ప్రకటించారు.

నాలుగేళ్లపాటు దాదాపు 93 లక్షల మంది మహిళలను ఆసరా ద్వారా ఆదుకుంటామని తెలిపారు. చేయూత, ఆసరా రెండూ పథకాలు పొందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఉంటారని పేర్కొన్నారు. వారికి పెద్దగా మేలు జరగుతుందన్నారు. ఆసరా కింద ఏడాదికి రూ.6700 కోట్లు సుమారు 9 లక్షల గ్రూపులకు అందిస్తున్నామని తెలిపారు. ఏడాదికి దాదాపు రూ.11వేల కోట్లు మహిళా సాధికారిత కోసం ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. దాదాపు కోటి మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు.

స్థిరమైన జీవనోపాధి వారికి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపేదిశగా ముందడుగు వేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అమూల్, హెచ్‌యూఎల్, ఐటీసీ, ప్రాక్టర్‌ అండ్‌ గాంబల్‌తో ఇప్పటికే అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. ఇప్పుడు రిలయన్స్, అలనా గ్రూపులు కూడా భాగస్వాములయ్యాయని తెలిపారు. మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించాలన్నది తమ ప్రయత్నం అన్నారు. తాము ఇచ్చే డబ్బు వారి జీవితాలను మార్చేదిగా ఉండాలన్నారు. ఈ దిశగా మీ సహకారాన్ని కోరుతున్నామని తెలిపారు.

తాము రైతు భరోసా కేంద్రాలనను కూడా ప్రారంఛించామని తెలిపారు. గ్రామ సచివాలయాల పక్కనే వీటిని ఏర్పాటు చేశామని… అక్కడే కియోస్క్‌ను పెడుతున్నామని పేర్కొన్నారు. 48 గంటల్లో రైతులు ఆర్డర్‌ చేసిన ఫెస్టిసైడ్స్, విత్తనాలు, ఎరువులను క్వాలిటీ టెస్ట్‌ చేసి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఇ-క్రాపింగ్‌ కూడా చేస్తున్నామని గుర్తు చేశారు.

కనీస గిట్టుబాటు ధరలను ఆర్బీకేల ద్వారా ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో గోడౌన్, మండలాల వారీగా కోల్డు స్టోరీలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. అలాగే ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లను, నియోజకవర్గాల్లో పార్కులను ఏర్పాటు చేస్తున్నామని…అతిమంగా ఇది జనతా బజార్‌కు దారి తీస్తుందన్నారు.

చిన్నవ్యాపారుల ప్రయోజనాలను కాంక్షిస్తూ తాము సమగ్రాభివృద్ధి దిశగా మేం అడుగులు వేస్తున్నామని మేనేజింగ్‌ డైరెక్టర్, రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌ వి. సుబ్రమణియం అన్నారు. స్థానికంగా ఉన్న చిన్న వ్యాపారులు కూడా లబ్ధి పొందాలన్నది తమ విధానం అన్నారు. ఏపీలో అరటి లాంటి ఉత్పత్తులను తాము దేశవ్యాప్తంగా కూడా మార్కెట్‌ చేస్తున్నామని తెలిపారు. దీని వల్ల మహిళలకు, తమకు పరస్పర ప్రయోజనం కలుగుతుందన్నారు.