Mualakalacheruvu Fake Liquor Case: నకిలీ మద్యం కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..

2022లో E 7 పేరుతో మరో ఆరుగురితో కలిసి హైదరాబాద్ లో మరో కొత్త బార్ ప్రారంభించాడు జనార్ధన్.

Mualakalacheruvu Fake Liquor Case: నకిలీ మద్యం కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..

Updated On : October 11, 2025 / 8:46 PM IST

Mualakalacheruvu Fake Liquor Case: నకిలీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించారు పోలీసులు. కల్తీ మద్యం కేసులో కింగ్ పిన్ జనార్ధన్ రావు 2012 నుండి లిక్కర్ వ్యాపారం ప్రారంభించారు. ANR బార్ ను నిర్వహిస్తున్నారు. లాభాలు వస్తున్న సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో హైవే మీద ఉన్న ANR బార్ ఇతర ప్రదేశానికి మార్చారు. వ్యాపారంలో పోటీ పెరగడం, దీనికి కరోనా తోడవడంతో 2021 వరకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. 2021 నుండి నకిలీ మద్యం తయారీ వ్యాపారం ప్రారంభించారు.

మొట్టమొదటిగా హైదరాబాద్ నిజాంపేటలో ఒక గది అద్దెకి తీసుకొని కల్తీ మద్యం తయారీ చేశారు. మద్యాన్ని 35 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలో నింపి.. నకిలీ ఇన్వాయిస్ లతో విజయవాడ ఇబ్రహీంపట్నం పంపించే వాడు. అక్రమ మద్యం డబ్బాలపై ఫినాయిల్ స్టిక్కర్ వేసి ఆర్టీసీ కొరియర్ ద్వారా ఇబ్రహీంపట్నం చేరవేసే వాడు. ప్లాస్టిక్ డబ్బాల్లో మద్యం ఉన్నా ఎటువంటి అనుమానం తలెత్తేది కాదు. కేసులో A5 నిందితుడు హాజీ దాన్ని రిసీవ్ చేసుకునే వాడు. ఈ అక్రమ మద్యాన్ని లీటర్ బాటిల్ లో తన బార్ లో లూస్ విక్రయాలు చేయటం వల్ల పెద్దగా అనుమానం కలగలేదని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు.

2022లో E 7 పేరుతో మరో ఆరుగురితో కలిసి హైదరాబాద్ లో మరో కొత్త బార్ ప్రారంభించాడు జనార్ధన్. అక్కడి నుండి 35 లీటర్ల బాటిల్స్ లో అక్రమ మద్యం తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం ANR బార్ లో అమ్మడం జరిగింది. 2023 జనవరిలో ఆరుగురు భాగస్వాములతో కలిసి గోవా వెళ్లాడు జనార్ధన్ రావు.

గోవాలో తెలుగు వ్యక్తి (ఈ కేసులో A3) బాలాజీ లిక్కర్ స్టోర్ లో జనార్ధన్ కు పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి ఇద్దరూ రెగ్యులర్ టచ్ లో ఉన్నారు. ఏపీ లో లిక్కర్ ధరలు ఎక్కువగా ఉండడంతో గోవా నుండి ఖరీదైన లిక్కర్ బ్రాండ్ కొనుగోలు చేస్తున్నారని జనార్ధన్ కు చెప్పాడు బాలాజీ. గోవాలో దొరుకుతున్న ఖరీదైన మద్యం మాదిరి నకిలీ మద్యాన్ని ఏపీకి పంపిస్తానని జనార్ధన్ కు ప్రతిపాదించాడు బాలాజీ.

హైదరాబాద్ నుంచి మూతలు సప్లయ్..

డిస్టలరీస్ తో బాలాజీకున్న పరిచయాలతో క్యారమిల్, స్పిరిట్ ఇతర ముడి పదార్ధాలు పంపగా 2023 నుండి ఇబ్రహీంపట్నం ANR బార్ లో కల్తీ మద్యం తయారీ ప్రారంభించాడు జనార్ధన్ రావు. 2023 ఏప్రిల్ నుండి కల్తీ మద్యం తయారీ వ్యాపారం ప్రారంభించాడు జనార్ధన్ రావు. నకిలీ లేబుల్స్ కేసులో A4గా ఉన్న రవి హైదరాబాద్ నుండి సరఫరా చేశాడు. బాటిల్స్ మూతలు హైదరాబాద్ నుండి సరఫరా చేశాడు దారబోయిన ప్రసాద్.

బెంగుళూరు, ముంబై, ఢిల్లీ నుండి ఏపీకి జనార్ధన్ కు ఐరిష్ వ్యాన్ లో సరఫరా చేశాడు బాలాజీ. ANR బార్ లో ఒకరోజు ఉండి కల్తీ మద్యం కోసం మిశ్రమం తయారు చేశాడు బాలాజీ. తర్వాత మిశ్రమం సాయంతో జనార్ధన్ రావు సోదరుడు జగన్ మోహన్ మంజీర విస్కీ, కేరళ మార్ట్ విస్కీ, ఓల్డ్ అడ్మినరల్, క్లాసిక్ బ్లూ వంటి కల్తీ మద్యం తయారు చేశాడు.

మొదట కల్తీ మద్యం బాటిల్స్ ANR బార్ లో నే విక్రయించారు. ఒక్కో క్వార్టర్ బాటిల్ పై 40 రూపాయలు లాభం గడించాన జనార్ధన్ రావు. 2024 ఎన్నికల సమయంలో నిఘా పెరగడంతో బాలాజీ స్పిరిట్ సరఫరా చేయలేదు. కొత్తగా ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరవడంతో కల్తీ మద్యం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశాడు జనార్ధన్ రావు.

జయచంద్రారెడ్డికి సన్నిహితుడు..

తంబళపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డికి జనార్ధన్ రావు స్నేహితుడు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి అనుచరుడు సురేంద్ర నాయుడు, జయచంద్రారెడ్డి పీఏ రాజేశ్ వైన్ షాపులు కొనుగోలు చేశారు. ములకలచెరువుకు చెందిన బాలగిరి సిద్దా ద్వారా రాజేష్, సురేంద్రతో స్నేహం చేశాడు జనార్ధన్ రావు. వారికి మద్యం వ్యాపారంలో అనుభవం లేకపోవడంతో వ్యాపారంలో నష్టం చవిచూశారు. దాంతో షాపులు నన్ను పర్యవేక్షణ చేయమన్నారు.

2025 మే, జూన్ లో ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ ప్రారంభించాడు జనార్ధన్ రావు. అదే సమయంలో ఇబ్రహీంపట్నంలో కూడా కల్తీ మద్యం తయారీ వ్యాపారం ప్రారంభించి విక్రయాలు జరిపాడు. జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో ఉన్నాడని తెలిసి అక్కడికి గత నెల 25న వెళ్ళాడు జనార్ధన్ రావు. ఆఫ్రికాలోని రువాండలో జనార్ధన్ ఉన్న సమయంలో ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీపై దాడులు నిర్వహించారు. అది తెలుసుకుని జనార్ధన్ ఇండియాకు వచ్చాడు” అని రిపోర్టులో పొందుపరిచారు.

Also Read: నకిలీ మద్యం కేసు తర్వాత ఆ ప్రాంతంలో వేడెక్కిన రాజకీయం.. ఏం జరుగుతోంది?