ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం? టీడీపీ లేదా జనసేనలోకి ముద్రగడ పద్మనాభం?

ఈ ఎన్నికల్లో ఇద్దరమూ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నామని తెలిపారాయన. కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురం నుంచి పోటీలో ఇంట్రస్ట్ చూపిస్తున్నామని చెప్పారు.

ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం? టీడీపీ లేదా జనసేనలోకి ముద్రగడ పద్మనాభం?

Mudragada Padmanabham

Updated On : January 11, 2024 / 6:24 PM IST

Mudragada Padmanabham : ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల హీట్ తారస్థాయికి చేరింది. రాజీనామాలు, చేరికలతో రాజకీయాలు ఇంట్రస్టింగ్ గా మారాయి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అంత స్పీడ్ గా పరిణామాలు మారిపోతున్నాయి. తాజాగా మరో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

వైసీపీలోకి వెళ్లేందుకు ముద్రగడ ఆసక్తి చూపడం లేదన్నారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో తాను తన తండ్రి.. ఇద్దరమూ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నామని తెలిపారాయన. కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురం నుంచి పోటీలో ఇంట్రస్ట్ చూపిస్తున్నామని, అన్నింటికి సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే నిర్ణయం ఉంటుందని తెలిపారు గిరిబాబు.

కాకినాడ జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిన్నటి వరకు కూడా అధికార వైసీపీకి సానుభూతిపరుడిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వైసీపీలో ఆయన జాయిన్ అయ్యే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపించాయి. ఇంతలో సడెన్ గా మరో వార్త తెరపైకి వచ్చింది. ముద్రగడ పద్మనాభం టీడీపీలో లేదా జనసేనలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు స్వయంగా చెప్పారు.

Also Read : ఆ 5 స్థానాలు టీడీపీకా? జనసేనకా? తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ

ఈ ఎన్నికల్లో కచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామని, ఎన్నికల బరిలో ఉంటామని గిరిబాబు చెప్పారు. కాకినాడ పార్లమెంటు స్థానం, ప్రత్తిపాడు, పిఠాపురం.. ఈ మూడు స్థానాల్లో ఒక స్థానం నుంచి కచ్చితంగా నేను, నా తండ్రి పద్మనాభం ఇద్దరం కూడా బరిలో ఉండే అవకాశం ఉందని గిరిబాబు వెల్లడించారు. తండ్రీ, కొడుకుల్లో ఎవరు పోటీలో ఉంటారు? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూడు స్థానాల్లో పోటీకి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్లు గిరిబాబు తెలిపారు.

నిన్న జనసేన నేతలు ముద్రగడ పద్మనాభంను కలిశారు. ఇవాళ టీడీపీ సీనియర్ నేత, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడను కలిశారు. ఇందులో రాజకీయ కోణం లేదని జ్యోతుల నెహ్రూ చెప్పినప్పటికీ.. వాళ్లు ఇద్దరూ కలిసినప్పుడు కచ్చితంగా రాజకీయాల ప్రస్తావన వచ్చి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు కాపు పెద్దల తిట్లను తాను దీవెనలుగా తీసుకుంటానని, కాపు పెద్దలు ఎవరైనా సరే జనసేనలోకి రావొచ్చని, కాపు పెద్దల కోసం జనసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Also Read : గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. ఇప్పుడిదే విజయ రహస్యం, ఎన్నికల ఫలితాలను శాసిస్తున్న ఫీల్ ఫ్యాక్టర్

అదే విధంగా లోపాయికారంగా ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కల్యాణ్ కు ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా ముద్రగడ పద్మనాభం, పవన్ కల్యాణ్ మధ్య సఖ్యత కుదిరే అవకాశం కనిపిస్తోంది. కాపు సామాజికవర్గానికి సంబంధించి పెద్దగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఇటు జనసేన కావొచ్చు అటు టీడీపీ కావొచ్చు.. ఏ పార్టీలోకి వచ్చినా పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తామని, రెండు పార్టీలు పొత్తులో ఉన్నందున ఏ పార్టీ నుంచైనా పోటీ చేయొచ్చని, మా సామాజికవర్గం పెద్దలను మేము గౌరవిస్తామని కూడా జ్యోతుల నెహ్రూ చెప్పారు.

మొత్తంగా ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం దాదాపుగా ఖరారైనట్లే తెలుస్తోంది. నిన్నటివరకు ముద్రగడ పద్మనాభం అధికార వైసీపీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించినా.. ప్రత్తిపాడు లేదా పిఠాపురం.. ఈ రెండు స్థానాల్లోనూ అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించేసింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా జనసేన పార్టీ నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పిఠాపురం నుంచి పోటీ చేస్తారా? లేక ప్రత్తిపాడు నుంచి బరిలోకి దిగుతారా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో నేను లేదా నా తండ్రి లేదా ఇద్దరమూ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నామని, ఏ విధంగా ముందుకెళ్లాలి అనేదానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందని ముద్రగడ గిరిబాబు ప్రకటించారు.