ఏపీకి సీఎం ఉన్నారా.. లేరా : మార్ఫింగ్ పై భగ్గుమన్న లోకేష్

ఏపీకి సీఎం ఉన్నారా.. లేరా : మార్ఫింగ్ పై భగ్గుమన్న లోకేష్

Updated On : September 12, 2019 / 7:29 AM IST

ఏపీ రాష్ట్రంలో సీఎం ఉన్నారా.. లేరా.. మాజీ ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధినేతను ఉగ్రవాది బిన్ లాడెన్ తో పోల్చుతూ పోస్టులు పెడుతుంటే మీ గుడ్డి సర్కార్ కు కనిపించటం లేదా.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు టీడీపీ యువనేత నారా లోకేష్. ట్విట్టర్ లో భగ్గుమన్నారాయన. చంద్రబాబుపై మార్ఫింగ్ ఫొటోలు పెట్టటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పొలిటికల్ టెర్రరిస్ట్ సీబీఎన్ (#politicalterristcbn) పేరుతో ట్విట్టర్ లో ట్రోల్ చేయటాన్ని తీవ్రంగా పరిగణించారు. 

ఇలాంటి పొస్టులు పెట్టిన వాళ్లపై చర్యలు తీసుకోవటానికి చేతులు రావట్లేదా? చట్టాలు లేవా? మీ చట్టాలన్నీ తెలుగుదేశం పార్టీ అభిమానులమీద కేసులు పెట్టటానికేనా? అని ప్రశ్నించారు యువనేత లోకేష్.

పట్నాడులోని ఆత్మకూరులో వైసీపీ బాధితులను పరామర్శించటానికి టీడీపీ పిలుపునిచ్చింది. దీనికి కౌంటర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ బాధితుల శిబిరాలు నిర్వహించింది. ఇది గ్రౌండ్ లో జరిగిన యుద్ధం. అదే ఇష్యూ సోషల్ మీడియాలో రచ్చ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పొలిటికల్ టెర్రరిస్ట్ సీబీఎన్ పేరుతో నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రోల్ చేశారు. అనూహ్యంగా ఇది ట్రెండింగ్ లోకి రావటం విశేషం. చంద్రబాబు ఫొటోలను బిన్ లాడెన్ లా మార్ఫింగ్ చేసి కొందరు భారీ ఎత్తున పోస్టులు పెట్టారు. ఇది ట్విట్టర్ దాటి.. ఫేస్ బుక్ వరకు వచ్చింది. 

లోకేశ్ చేసిన ట్విట్టర్‌లో చేసిన పోస్టు వివరాలు ఇలా ఉన్నాయి. ‘@ysjagan గారూ! అసలీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా లేనట్టా? మీ గుడ్డి సర్కారుకు ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు కనపడట్లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి పోస్టు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోడానికి చేతులు రావట్లేదా? చట్టాలు లేవా? మీ చట్టాలన్నీ తెదేపా అభిమానులమీద కేసులు పెట్టడానికేనా?’ అని పోస్టు పెట్టారు.