GVMC: క్లైమాక్స్‌కు చేరిన విశాఖ గ్రేటర్ రాజకీయం.. మేయర్ పీఠంపై ఉత్కంఠ.. నేడే ‘మేయర్ పై అవిశ్వాస’ కౌన్సిల్ సమావేశం..
ఉదయం 11గంటలకు జీవీఎంసీ ఇన్ ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ అధ్యక్షతన ‘మేయర్ అవిశ్వాస’ కౌన్సిల్ సమావేశం జరగనుంది.

GVMC
GVMC: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి అవిశ్వాసం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం 11గంటలకు జీవీఎంసీ ఇన్ ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా పార్టీని వీడడంతో కూటమి బలం పెరిగింది. దీంతో కొద్దిరోజులుగా విశాఖ మేయర్ పీఠం ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఆ ఉత్కంఠకు ఈరోజు తెరపడే అవకాశం ఉంది.
మేయర్ పై అవిశ్వాసం ప్రకటించిన తరువాత జీవీఎంసీ రాజకీయం వేడెక్కింది. వైసీపీ, కూటమి నాయకులు తమ మద్దతుదారులను క్యాంపులకు తరలించారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ లో ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి మొత్తం 111 ఓట్లు ఉన్నాయి. వైసీపీ నుంచి చేరికలతో తెలుగుదేశం పార్టీ బలం 39మంది కార్పొరేటర్ల నుంచి 48కి చేరింది. మరోవైపు కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ కార్పొరేటర్ల సంఖ్య 14కు చేరింది. రాజీనామాలు, పార్టీ ఫిరాయింపులతో వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 59 నుంచి 31కి పడిపోయింది. బీజేపీకి ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. 11 మంది ఎక్స్ అఫిషియో సభ్యుల బలం ఉంది. అయితే, మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మేజిక్ ఫిగర్ 74. దీంతో మేజిక్ ఫిగర్ కు కావాల్సిన బలాన్ని కూటమి సమకూర్చుకుంటుంది.
వైసీపీ ఇప్పటికే తమ కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. మరోవైపు ఓటింగ్ ను బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం జీవీఎంసీ చుట్టూ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. కౌన్సిల్ లో ఓటింగ్ ను వీడియో రికార్డు చేయాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ, కూటమి నాయకులు తమ మద్దతుదారులను క్యాంపులకు తరలించారు. కూటమి కార్పొరేటర్లు మలేసియా వెళ్లగా.. వైసీపీ కార్పొరేటర్లు ముందుగా బెంగళూరు, అక్కడి నుంచి శ్రీలంక చేరుకున్నారు. కూటమి కార్పొరేటర్లు శుక్రవారం రాత్రి విమానాశ్రయానికి రాగా వారికి ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణ స్వాగతం పలికి హోటల్ కు తరలించారు. ఇవాళ ఉదయం 10గంటలకు జీవీఎంసీకి వారు చేరుకొనేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మరోవైపు.. అదిష్టానం ఆదేశాల మేరకు వైసీపీ కార్పొరేటర్లు సమావేశానికి దూరంగా ఉండనున్నారు. శనివారం తరువాత వారంతా నగరానికి వచ్చే అవకశాలు ఉన్నాయి.