NTR Vaidya Seva: రేపటి నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్..
బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చిన్న ఆసుపత్రులు మూతపడే పరిస్థితి ఏర్పడిందని అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు.
NTR Vaidya Seva: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ సేవలు (ఆరోగ్యశ్రీ) బంద్ కానున్నాయి. రేపటి నుంచి (ఏప్రిల్ 1) ఉచిత వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా-ASHA) ప్రకటించింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేసిందని అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు. ఈ క్రమంలో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ బకాయిలను విడుదల చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కాగా ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తున్న నెట్ వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి.
బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చిన్న ఆసుపత్రులు మూతపడే పరిస్థితి ఏర్పడిందని అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్యాకేజీ ధరలను కూడా సవరించాలన్నారు. లేదంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
4 నెలలుగా సుమారు 3వేల కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయినా చెల్లింపులపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. పాత బకాయిల సంగతి తేల్చకుండానే ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ‘ఇన్సూరెన్స్ మోడల్’ అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆసుపత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాత బకాయిల బాధ్యత ఎవరు తీసుకుంటారని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక 2017 నాటి పాత ప్యాకేజీ ధరలనే ఇంకా కొనసాగిస్తున్నారని.. పెరిగిన వైద్య, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా పాత రేట్లకు వైద్యం అందించడం సాధ్యం కాదని అసోసియేషన్ ప్రతినిధులు తేల్చి చెప్పారు.
