ప్రకాశం బ్యారేజ్ దగ్గర శరవేగంగా ఆపరేషన్ బోటు.. ముక్కలు చేసి బయటకు తరలించే ప్రయత్నం..!
బోటును రెండువైపుల కట్ చేశాక బయటకు తీసి కింద భాగాన్ని కూడా గ్యాస్ కట్టర్ తో కట్ చేయనున్నారు.

Operation Boat : ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొని అక్కడే చిక్కుకున్న బోట్లు తొలగింపు ప్రక్రియ నాలుగో రోజూ కొనసాగుతోంది. రెండు రోజులుగా శ్రమించి ఒక బోటును రెండు భాగాలుగా కోసి వేరు చేశారు డైవింగ్ టీమ్ సభ్యులు. ఇవాళ మరో భారీ బోటును బయటకు తీయనున్నారు. గతంలో గోదావరిలో కచ్చులూరు దగ్గర మునిగిపోయిన బోటును బయటకు తీసిన టీమ్ ను రంగంలోకి దింపనున్నారు అధికారులు. వీరి సాయంతో మిగిలిన మూడు బోట్లను కట్ చేసి బయటకు తీయబోతున్నారు అధికారులు.
గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్లతో తీసేందుకు ప్రయత్నించినా రాకపోవడంతో అండర్ వాటర్ ఆపరేషన్ ద్వారా బోట్లను ముక్కలు చేసి తొలగిస్తున్నారు. మొన్న భారీ క్రేన్లతో బోట్లను వెలికితీసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఒక్కో బోటు 40 టన్నుల బరువు ఉండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో నది లోపలికి దిగి పడవలను గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసే డైవింగ్ టీమ్ లను రంగంలోకి దించారు అధికారులు.
ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లను తీయడానికి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సాధారణంగా బోట్లు చెక్కతో తయారు చేసి ఉంటాయి. చెక్కతో చేసిన బోటు ఎంత పెద్దగా ఉన్నా సులభంగా కట్ చేసి బయటకు తీసే పరిస్థితి ఉంటుంది. కానీ, ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లు పూర్తిగా ఇనుముతో చేసున్నాయి. బోటు ఖాళీగా ఉంటేనే దాదాపు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుంది. ఇప్పుడు నీటిలో మునిగిపోవడంతో వాటి బరువు మరింత పెరిగి బయటకు తీయడం కష్టతరంగా మారిందని అధికారులు అంటున్నారు.
Also Read : ఏపీ రాజకీయాల్లో ఇదో కొత్త కోణం.. వరద విరాళాల వెనుక పక్కా వ్యూహం?
నదిలో బోట్ల తొలగింపు ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. పలు రకాల టెక్నాలజీలు వినియోగించి బోట్లను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మొదట భారీ క్రేన్ల సాయంతో బోట్లను పైకి లేపి బయటకు తీయాలని ప్రయత్నించారు. అయితే ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. దీంతో మరో ప్లాన్ అమలు చేస్తున్నారు. బోట్లను ముక్కలుగా కట్ చేసి వెలికితీసే పనులు ప్రారంభించారు. బోటును రెండు ముక్కలు చేశాక ఒక ముక్కను తాడు సాయంతో బయటకు లాగుతారు.
మరో ముక్కను బోటుకు కట్టేసి దాన్ని కూడా బయటకు లాగే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి మొత్తం 7 బోట్లను అధికారులు ప్రకాశం బ్యారేజీలోకి దించారు. ముక్కలైన పడవ బరువును బట్టి బోట్లకు కట్టేసి బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. బోటును రెండువైపుల కట్ చేశాక బయటకు తీసి కింద భాగాన్ని కూడా గ్యాస్ కట్టర్ తో కట్ చేయనున్నారు. ఆ తర్వాత ముక్కలను లాకెళ్లే ప్రయత్నం చేస్తారు.