Operation Mother Tiger : ఆపరేషన్ తల్లి పులి.. పెద్ద పులి ఎక్కడ? జాడ కోసం కొనసాగుతున్న సెర్చ్
నంద్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ 'తల్లి పులి' కొనసాగుతోంది. తల్లి పులి కోసం అధికారులు విస్తృతంగా సెర్చ్ చేస్తున్నారు. తల్లి పులి నెంబర్ T-108 గా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పిల్లలకు దూరమైన తల్లి పులి ప్రవర్తనను అంచనా వేయలేమన్న అటవీ అధికారులు..

Operation Mother Tiger : నంద్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ ‘తల్లి పులి’ కొనసాగుతోంది. తల్లి పులి జాడ కోసం అధికారులు విస్తృతంగా సెర్చ్ చేస్తున్నారు. తల్లి పులి నెంబర్ T-108 గా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పిల్లలకు దూరమైన తల్లి పులి ప్రవర్తనను అంచనా వేయలేమన్న అటవీ అధికారులు.. ఒకేసారి పులి నాలుగు పిల్లలకు జన్మనివ్వడం చాలా అరుదు అని చెప్పారు. అందులోనూ నాలుగూ ఆడ పులి పిల్లలు కావడం అత్యంత అరుదు అన్నారు.
సాధ్యమైనంత త్వరగా తల్లి పులి చెంతకు చేర్చుతామని, ఒకవేళ తల్లి పులి జాడ దొరక్కపోతే, రెండేళ్ల పాటు సంరక్షించి అడవిలో వదిలేస్తామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ శివారులో పులి పిల్లలు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. తల్లి నుంచి విడిపోయి దారితప్పిన నాలుగు పెద్ద పులి పిల్లలు గ్రామంలోకి వచ్చేశాయి. కుక్కలు వాటిని చంపేస్తాయనే భయంతో గ్రామస్తులు పులి పిల్లలను తీసుకెళ్లి ఓ గదిలో ఉంచి సంరక్షించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
గ్రామస్థుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పులి పిల్లలను పరిశీలించారు. తల్లి నుంచి విడిపోయి చాలా సమయం కావడంతో పాలు అందక బాగా నీరసించిపోయినట్టు గుర్తించారు. వాటి ముందు సెరెలాక్, పాలు వంటి వాటిని పెట్టినా అవి ముట్టలేదు. అధికారులు వాటిని బైర్లూటి వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. పులి కూనలన్నీ ఆడవేనని, ఒకేసారి నాలుగు ఆడ పిల్లలకు జన్మనివ్వడం అరుదని అధికారులు తెలిపారు. కాగా, పులి పిల్లలు గ్రామంలోకి వచ్చాయంటే వాటి తల్లి సమీపంలోనే ఉంటుందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
Also Read..12 Cheethas : భారత్ కు మరో 12 చిరుతలు
పెద్దగుమ్మడాపురం సమీపంలో నల్లమల అటవీ ప్రాంత నుంచి తప్పించుకుని ఊరి చివర పంట పొలాల్లోకి పులి పిల్లలు వచ్చాయి. ఈ పిల్లలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తుల తరలి వస్తున్నారు. కొందరు ఆ పిల్లలతో సెల్ఫీలు దిగారు.
Also Read..Cheetah : 50 ఏళ్ల క్రితం అంతరించిపోయిన చిరుతలు మళ్లీ ఇండియాకు వస్తున్నాయి
ఈ పిల్లలను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలా? లేక జూకు తరలించాలా? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ పిల్లలను జూకి తరలిస్తే.. తల్లి పులి వీటి కోసం గ్రామంలోకి చొరబడి ప్రజలపై దాడి చేసే అవకాశముందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అలాగని అటవీ ప్రాంతంలో వదిలేస్తే కుక్కలు, ఇతర జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వీటిని ఎక్కడికి తరలించాలన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే.. ఒకవేళ తల్లి పులి జాడ దొరక్కపోతే, రెండేళ్ల పాటు పిల్లలను తామే సంరక్షించి ఆ తర్వాత అడవిలో వదిలేయాలని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు.