Cheetah : 50 ఏళ్ల క్రితం అంతరించిపోయిన చిరుతలు మళ్లీ ఇండియాకు వస్తున్నాయి

భారత దేశంలో దాదాపు 50 ఏళ్ల క్రితం అంతరించి పోయిన చిరుత పులులను విదేశాలనుంచి దిగుమతి చేసుకుని తిరిగి భారత్ లోని అడవులలో పెంచనున్నారు.

Cheetah : 50 ఏళ్ల క్రితం అంతరించిపోయిన చిరుతలు మళ్లీ ఇండియాకు వస్తున్నాయి

Cheetah : భారత దేశంలో దాదాపు 50 ఏళ్ల క్రితం అంతరించి పోయిన చిరుత పులులను విదేశాలనుంచి దిగుమతి చేసుకుని తిరిగి భారత్ లోని అడవులలో పెంచనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది. ఆఫ్రికా అడవుల్లో బంధించిన చిరుత పులులను ఇండియా తీసుకు వస్తున్నారు. భారత్ లో అంతరించి  పోయిన జంతువులను  పరిరక్షించాలనే ప్రయత్నంలో ఇది భారీ ముందడుగు అని వైల్ట్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా డీన్ యాదేంద్రదేవ్ ఝూలా అన్నారు.  చిరుత పులులను ఇండియా తీసుకు వచ్చేందుకు పని చేస్తున్న టీంలో ఆయన  కూడా ఒకరు.

ప్రపంచంలోని వేల చిరుత పులులలో మూడింట ఒక వంతు నమీబియాలోనే ఉన్నాయి.  ప్రపంచంలోని  మొత్తం చీతాల్లోని సగం నమీబియా, దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా  దేశాల్లోనే ఉన్నాయి.  ప్రస్తుతం దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి 16 చీతాలను ఇండియా తీసుకొస్తున్నారు.  వీటిని పట్టుకునేందుకు హెలికాప్టర్ల ద్వారా  ట్రాంక్విలైజర్లను వాటిపై ప్రయోగించారు. వాటిని బంధించిన తర్వాత వాటికి మైక్రో చిప్ లు అమర్చారు. వాటికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఇన్ ఫెక్షన్లు రాకుండా యాంటీ బయోటిక్స్ ఎక్కించారు.  డీ హైడ్రేషన్ అవకుండా ఐవీలను ఎక్కించారు.

డీఎన్ఏ విశ్లేషణ కోసం రక్త నమూనాలను తీసుకున్నారు. ఇప్పడు ఇండియా తీసుకువస్తున్న చిరుతపులుల్లో ఆరు ఆడపులులు ఉన్నాయి. అవి పిల్లలను కనే వయస్సులోనే ఉన్నాయని దక్షిణాఫ్రికా పశువైద్య నిపుణుడు మ్యూసెస్ విన్సెంట్ వాన్ డెర్ మెర్వే చెప్పారు.  దక్షిణాఫ్రికా నుంచి తీసుకొస్తున్న చిరుతల్లో ప్రస్తుతం రూయిబర్గ్, ఫిండాలలోని రెండు క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. మరో నాలుగు నమీబియాలో ఉన్నాయి.

వీటికి వ్యాధులు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రేబిస్, బ్లడ్ పారాసైట్స్, హెర్పిస్ సహా ఆరు టీకాలను వీటికి ఇచ్చారు.  క్వారంటైన్ కేంద్రాల్లోని పశువైద్య నిపుణుల సంరక్షణలో వీటిని జాగ్రత్తగా గమనిస్తున్నారు.  ఎలాంటి వ్యాధులు సోకకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మెర్వే వివరించారు.

ఇండియా తీసుకు వచ్చాక కూడా వీటిని నెల రోజుల పాటు కూనో నేషనల్ పార్క్ లోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచుతారు. సాధారణంగా ఇలాంటి పెద్ద జంతువులు తాము వచ్చిన ప్రాంతానికి వెళ్లిపోవటానవికి ప్రయత్నిస్తుంటాయి. అందుకని వీటిని ఒకటి రెండు నెలల పాటు కంచెలు ఉన్న ప్రాంతాల్లో ఉంచాలని మెర్వే తెలిపారు. ఆతర్వాత వీటిని 11,500 హెక్టార్ల సువిశాల జాతీయ పార్కులో వీటిని స్వేఛ్చగా వదిలేస్తారు.