పంచాయతీ ఎన్నికలు ఆపలేం.. ఏపీ ప్రభుత్వం పిటీషన్‌పై హైకోర్టు తీర్పు

  • Published By: vamsi ,Published On : December 8, 2020 / 12:03 PM IST
పంచాయతీ ఎన్నికలు ఆపలేం.. ఏపీ ప్రభుత్వం పిటీషన్‌పై హైకోర్టు తీర్పు

Updated On : December 8, 2020 / 12:12 PM IST

High Court verdict: పంచాయతీ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను కొట్టివేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఇబ్బందులేంటని ప్రశ్నించిన కోర్టు.. స్టే ఇవ్వలేమని తీర్పు ఇచ్చింది.



ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ చేసిన ప్రకటనపై పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఈ పిటీషన్‌ను విచారించిన ధర్మాసనం.. ఎన్నికలను నిలిపివేసేందుకు నిరాకరించింది. ఎన్నికల కమిషనర్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రకటన చేశారంటూ పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొనగా.. పిటిషన్‌లో ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని చేర్చారు.



ఎస్ఈసీ ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందని ప్రభుత్వం అందులో పేర్కొంది. కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని పిటీషనర్ వెల్లడించగా.. ఎన్నికలు జరిగితే ప్రజారోగ్యానికి మంచిది కాదని పిటీషన్‌లో వెల్లడించింది ప్రభుత్వం. అయితే కౌంటర్‌ దాఖలు చేయాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.



ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ ప్రకటన విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎలక్షన్ కమిషన్ గతంలో కరోనా అంటూ ఎన్నికలు వాయిదా వేసి, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే, ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన హైకోర్టు లేటెస్ట్‌గా తీర్పు ఇచ్చింది.