Adapa Seshu : జగన్ అంటే భయం, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా- పవన్ కల్యాణ్‌పై అడపా శేషు ఫైర్

Adapa Seshu : టీడీపీ హయాంలో మహిళలతో ఎలా ఆడుకున్నారో అందరూ చూశారు.. పవన్ ఆనాడు నోరెత్తలేదు.. పవన్ వెనుక తిరిగే కాపు యువత ఆలోచించండి..

Adapa Seshu : జగన్ అంటే భయం, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా- పవన్ కల్యాణ్‌పై అడపా శేషు ఫైర్

Adapa Seshu (Photo : Twitter, Google)

Updated On : July 10, 2023 / 7:14 PM IST

Adapa Seshu – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలతో మంటలు పుట్టించారు. వారాహి విజయ యాత్రలో పవన్ చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏలూరులో బహిరంగ సభలో పవన్ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్ లో మహిళల అదృశ్యం, వాలంటీర్ల వ్యవస్థపై పవన్ ‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. పవన్ కామెంట్స్ పై దుమారం కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళల మిస్సింగ్ ఆరోపణలపై ఆధారాలివ్వాలని చెప్పింది. ఇక, వాలంటీర్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. పవన్ కల్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ పై చర్యలు తీసుకోవాలన్నారు. తమను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు పవన్ క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు.

పవన్ కు పేమెంట్ ఉంటే చాలు:
తాజాగా ఈ వ్యవహారంపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు స్పందించారు. పవన్ పై ఆయన ఫైర్ అయ్యారు. వారాహి యాత్ర జనసేన కోసమా? చంద్రబాబు కోసమా..? అని నిలదీశారు. పవన్ కల్యాణ్ జనసేనను పూర్తిగా మర్చిపోయారని, చంద్రబాబును సీఎం చెయ్యడమే టార్గెట్ గా పెట్టుకున్నారని విమర్శించారు. అసలు పార్టీ నిర్మాణం లేదు.. అభ్యర్థులు లేరు.. ముందు వాటిపై దృష్టి పెట్టు అని పవన్ కు హితవు పలికారు. పవన్ కి పార్టీతో పని లేదు.. పేమెంట్ ఉంటే చాలు అని విమర్శలు గుప్పించారు. పవన్ వెనుక తిరిగే కాపు యువత ఆలోచించండి.. సమయాన్ని, భవిష్యత్తును వృథా చేసుకోకండి అని అడపా శేషు కోరారు.(Adapa Seshu)

Also Read..Pawan Kalyan : ఏపీ 30వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారు- వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు

పవన్ నటుడు మాత్రమే, నాయకుడు కాలేడు:
” పవన్ ఎప్పటికీ నటుడే మాత్రమే.. నాయకుడు కాలేడు.. పవన్ స్క్రిప్ట్, పేమెంట్ నే నమ్ముకున్నాడు.. కాపుల ఓట్ల కోసం పవన్ తో చంద్రబాబు కుట్ర రాజకీయం చేయిస్తున్నారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ వైపు దేశంలో మిగిలిన రాష్ట్రాలు చూస్తున్నాయి. టీడీపీ హయాంలో మహిళలతో ఎలా ఆడుకున్నారో అందరూ చూశారు.. పవన్ ఆనాడు నోరెత్తలేదు.. జగన్ ను చూస్తే పవన్ భయపడుతున్నారు. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
సీఎం జగన్ ను ఏకవచనంతో పిలిస్తే చూస్తూ ఊరుకుంటామా?” అని పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు అడపా శేషు.

అసలు పవన్ ఏమన్నారంటే..
వారాహి విజయ యాత్రలో భాగంగా ఆదివారం ఏలూరులో బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఏపీలో 30వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని, దీని వెనుక వాలంటీర్ల హస్తం ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తనతో చెప్పాయని పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒంటరిగా, భర్త లేని, బాధల్లో ఉన్న మహిళలను వెతికి పట్టుకోవడం, ట్రాప్‌ చేయడం, బయటకు తీసుకెళ్లడం, మాయం చేయడం ఇదే వాలంటీర్ల పని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. మహిళల మిస్సింగ్ వెనుక వైసీపీ పెద్దల హస్తం కూడా ఉందన్నారు పవన్ కల్యాణ్.

”రాష్ట్రంలో మహిళల అదృశ్యం, అక్రమ రవాణ వెనుక వైసీపీ నేతలు ఉన్నారు. వాలంటీర్లు రహస్యంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి.. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. వారిలో మహిళలు ఎందరు, వితంతువులున్నారా అని ఆరా తీస్తున్నారు. ఈ పాలనలో అదృశ్యమైన 30వేల మందిలో 14వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణం” అని పవన్ కల్యాణ్ ఆరోపించారు. మహిళల అదృశ్యం, వాలంటీర్ల వ్యవస్థ గురించి పవన్ చేసిన ఈ ఆరోపణలు తీవ్ర దుమారమే రేపాయి.

Also Read..Machilipatnam Constituency: రోజురోజుకి వేడెక్కుతున్న మచిలీపట్నం రాజకీయం.. ఈసారి పోటీ మామూలుగా ఉండదు!