పవన్ గతంలో చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారా ? పార్టీ బలోపేతంపై దృష్టి ఎప్పుడు

పవన్ గతంలో చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారా ? పార్టీ బలోపేతంపై దృష్టి ఎప్పుడు

Updated On : December 31, 2020 / 7:16 PM IST

Pawan Kalyan On Party Cadre : జనసేనాని ఓ విమర్శ చేస్తే అది..బుల్లెట్‌లా దూసుకెళ్తుంది. ఎక్కడికెళ్లినా ఆయన సభ గ్రాండ్‌ సక్సెస్ అవుతుంది. పవన్ వస్తున్నారంటే.. జనసేన శ్రేణుల్లో ఓ జోష్‌ ఉంటుంది. కానీ ఆ జోష్ ఏడాది పొడవునా ఉండదు. ట్రెండ్‌ ఫాలో అవ్వను సెట్‌ చేస్తా అనే పవన్‌.. రెగ్యులర్‌ పార్టీల ట్రెండ్‌ను ఎప్పటికీ ఫాలో అవ్వరా. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌ అవుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్…గతంలో చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారా? 2014 ఎన్నికలకు ముందు పార్టీని ప్రకటించిన పవన్‌.. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ – బీజేపీకి మద్దతిచ్చారు. 2019 ఎన్నికల నాటికి పార్టీ నిర్మాణం క్షేత్రస్థాయిలో జరుగుతుందని అంతా భావించారు. కానీ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండానే ఎన్నికలకు వెళ్లారు. ఒక్క సీటు తప్ప మిగతా అన్ని చోట్ల జనసేన ఘోరంగా ఓడిపోయింది. ఆ ఎన్నికల తర్వాత పార్టీ పునర్నిర్మాణం చేస్తానని ప్రకటించిన పవన్‌…మళ్లీ పాత పద్దతినే ఫాలో అయిపోతుండడంతో జనసేన శ్రేణులు, అభిమానులు కలవరపడుతున్నారట.

13 జిల్లాలకు అధ్యక్షులు ఎక్కడ ? 
ఏదేని పార్టీ బలంగా ఉండాలంటే సదరు పార్టీ నిర్మాణం బలంగా ఉండాలి. కార్యకర్తల సభ్యత్వం భారీ సంఖ్యలో ఉండాలి. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలుండాలి. రాష్ట్ర స్థాయి కమిటీలు అటుంచితే..జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీల నిర్మాణమే ఇంతవరకు జరగలేదు. 13 జిల్లాలకు ఇంతవరకు పార్టీ అధ్యక్షులను ప్రకటించలేదు. కొన్ని నియోజకవర్గాలకు తప్ప చాలా నియోజకవర్గాలకు జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియామకం జరగలేదు. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినా కొన్ని నియోజకవర్గాలకే పరిమితం అయ్యింది. ఇలా అయితే ఎలా అని పార్టీ అభిమానులూ ఆవేదన చెందుతున్నారట. ఏడాదిన్నర అయినా ఇప్పటికీ పార్టీ నిర్మాణ ప్రక్రియ మందకొడిగానే జరిగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

పార్టీ బలోపేతంపై దృష్టి ఎక్కడ ? 
గతంలో మాదిరే పవన్‌ పర్యటనలకు వెళ్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారు. నివర్‌ తుపాను, వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించారు. నెల్లూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో బాధిత రైతులను పరామర్శించారు. ఇటీవల గుడివాడ సెంటర్‌కు పవన్‌ వెళితే జనం భారీగా వచ్చారు. మచిలీపట్నంలో చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. పవన్‌ ఎక్కడ పర్యటించినా అక్కడ పార్టీ శ్రేణుల కోలాహలం కనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు ఇంతకన్నా ఎక్కువగానే జనం వచ్చేవారు. కానీ జనం తరలివచ్చినంతగా …ఓట్లు పోలవ్వలేదన్న సంగతిని గుర్తుంచుకోవాలిగా అనే సెటైర్లు వినిపిస్తున్నాయిప్పుడు.
పవన్‌ నిరసనలు, పర్యటనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టట్లేదనే విమర్శలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. క్యాడర్‌ ఉన్నా…సక్రమంగా నడిపించే నేతలే లేరనే టాక్‌ పార్టీ వర్గాల్లోనే నడుస్తోంది.

మార్పు ఎప్పుడో ? 
దీంతో ప్రజల్లోకి పార్టీ వెళ్లడంలో విఫలమవుతుందని భావిస్తున్నారు. రాజకీయ పార్టీ నిలదొక్కుకోవాలంటే నిరంతరం ప్రజలతో మమేకమవ్వాలి. అధినేత మాత్రమే కాదు.. ఆయా నియోజకవర్గాల్లో నేతలు సైతం ప్రజా సమస్యలపై పోరాడాలి. కానీ జనసేనాని వెళితే తప్ప స్థానికంగా సందడి కనపించట్లేదు. పవన్‌ వెళితే ఓ హైప్‌ క్రియేట్‌ అవుతుంది. ఆ సమయానికి స్థానిక కార్యకర్తలకు తాత్కాలిక బాధ్యతలు ఇస్తున్నారు. పార్టీలో క్రియాశీలకంగా నలుగురు నేతలు ముందుగా వెళ్లి పర్యటన ఏర్పాట్లు చూస్తున్నారు. పవన్‌ టూర్‌ని సక్సెస్‌ చేస్తున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో లోకల్‌ లీడర్లు ఎవరన్నది పార్టీ క్యాడర్‌కే తెలియట్లేదు. దీంతో ఎవరి వెంట నడవాలో తెలియని అయోమయం నెలకొంది. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేనలో ఇలాంటి పరిస్థితే ఉండడంతో.. మార్పు ఇంకెప్పుడు వస్తుందో అని గుసగుసలాడుకుంటోందట క్యాడర్‌.

పార్టీకి ఇబ్బందులు తప్పవా ? 
పవన్‌ ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరుకు రెస్పాన్స్‌ బాగానే వస్తుందని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు. అయితే ఈ స్పందన ఓట్ల రూపంగా మారతాయా అంటే డౌటే. అందుకే.. పార్టీ నిర్మాణం, బలోపేతం విషయంలో పవన్ కళ్యాణ్ దూకుడు పెంచాల్సిందేనని వాదన బలంగా వినిపిస్తోంది. లేకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాన్ని.. జనసేనలోని కొందరు నేతలూ వ్యక్తం చేస్తున్నారు.