జగన్‌కు ప్రతిపక్ష నేతగా అవకాశం లేదు.. ఫ్లోర్ లీడర్ మాత్రమే: మంత్రి పయ్యావుల కేశవ్

అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు.

జగన్‌కు ప్రతిపక్ష నేతగా అవకాశం లేదు.. ఫ్లోర్ లీడర్ మాత్రమే: మంత్రి పయ్యావుల కేశవ్

Payyavula Keshav says no chance to ys jagan to be a leader of opposition

Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని ఏపీ ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌కు జనమే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ స్పీకర్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖకు ఆయన కౌంటర్ ఇచ్చారు. జగన్ రూల్స్ చదువుకోవాలని సూచించారు. వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా మాత్రమే ఆయన కొనసాగుతారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, జనసేన పార్టీలకు ఫ్లోర్ లీడర్లు ఉన్నారని తెలిపారు.

లేఖ రాయమని సలహా ఇచ్చిందెవరు?
”జగన్ ప్రజలు ఇచ్చిన తీర్పు జీర్ణించుకోలేదు. పార్టీలు ప్రతిపక్ష హోదా ఇవ్వవు. రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఈ లేఖ రాయమని మీకు ఎవరు సలహా ఇచ్చారు. ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి. సాంప్రదాయంగా ఓత్ చేస్తారని చెబుతున్నారు. అసెంబ్లీ బుక్స్ చూడండి. మీరు ఫ్లోర్ లీడర్ మాత్రమే. ప్రతిపక్ష హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడు కాదు. ఓనమాలు తెలియకుండా మీతో ఎవరు లేఖ రాయించారు? సభలో 10 వంతు సభ్యులున్నవాళ్లకు మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మొదటి స్పీకర్ మల్వాంకర్ రాశారు. అందరు ఎమ్యెల్యేల్లాగానే మీకు మాట్లాడే అవకాశం వుంటుంద”ని మంత్రి కేశవ్ చెప్పారు.

Also Read : అందుకే, ఘోరంగా ఓడిపోయాం..!- దిమ్మతిరిగిపోయే కారణాలు చెబుతున్న వైసీపీ లీడర్లు

జగన్‌ పదేళ్లు ఆగాల్సిందే..
కేంద్రంలో ప్రతిపక్ష హోదా పొందడానికి కాంగ్రెస్ పార్టీకి పదేళ్లు పట్టిందని గుర్తు చేశారు. జగన్‌కు కూడా ప్రతిపక్ష హోదా పొందడానికి పదేళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. ”2014లో 44 సీట్లు వచ్చాయి. ఆ రోజు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. 2019లో 54 సీట్లు వచ్చాయి. అప్పుడు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఫ్లోర్ లీడర్లుగా మాత్రమే కొనసాగారు. పదేళ్ల తర్వాత ఈరోజే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ విపక్ష హోదా దక్కింది. వైసీపీ కూడా ప్రతిపక్ష హోదా రావడానికి కచ్చితంగా 10 సంవత్సరాలు పడుతుంది. 2029లోనూ వైసీపీ ప్రతిపక్ష హోదా రాద”ని పయ్యావుల కేశవ్ అన్నారు.

Also Read : పరుష పదజాలం వాడొద్దు, మర్యాదపూర్వకంగా ఉండాలి- ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ సూచనలు

జగన్‌పై కడప ఎమ్మెల్యే ఫైర్
ప్రతిపక్ష హోదాపై కనీస అవగాహన లేకుండా జగన్ లేఖ రాయడం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిపిన జగన్ రెడ్డి కొత్త రాజ్యాంగం రాస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం హేయమని అన్నారు. స్పీకర్ ఎన్నిక రోజు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదని విమర్శించారు. జగన్ పాలనలో నష్టపోని వారంటూ ఎవరూ లేరని.. అందుకే పులివెందులలో కూడా జగన్‍పై రాళ్లు విసిరారని అన్నారు.