ఎన్నికలు రాబోతున్నాయ్.. చంద్రబాబు వీటితో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు ఇస్తున్న హామీలను నెరవేర్చాలంటే రాష్ట్రానికి అదనంగా..

ఎన్నికలు రాబోతున్నాయ్.. చంద్రబాబు వీటితో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy, Chandrababu

Updated On : March 9, 2024 / 3:24 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్ సిక్స్ అనే పథకాలతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పెద్దిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు.

నలభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు ఇస్తున్న హామీలను నెరవేర్చాలంటే రాష్ట్రానికి అదనంగా 2.5 లక్షల కోట్ల రూపాయలు అవసరమని చెప్పారు. అది సాధ్యం కాదని సీఎం వైఎస్ జగన్ గణాంకాలతో పాటు అసెంబ్లీలో చూపించారని తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఆ మానిఫెస్టోను ఆన్‌లైన్‌లో కూడా లేకుండా చేశారని చెప్పారు.

చంద్రబాబు రాజకీయ వికలాంగుడని అన్నారు. అందుకే కొన్ని పార్టీలను ఊదకట్టెలులాగా తెచ్చుకుంటున్నారని పెద్దిరెడ్డి చెప్పారు. తాము వైఎస్ జగన్ నేతృత్వంలో సింగిల్‌గా పోటీ చేస్తున్నామని, ఏపీలో అత్యధిక స్థానాల్లో గెలుస్తామని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, అయినప్పటికీ కనీసం ఒక్క పథకమైన గుర్తుపెట్టుకునేలా అమలు చేయలేదని అన్నారు.

ఇప్పుడు మరోసారి పథకాల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని పెద్దిరెడ్డి చెప్పారు. అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణ, రాయదుర్గం అసెంబ్లీ నుంచి మెట్టు గోవింద రెడ్డి పోటీ చేస్తున్నారని తెలిపారు. వీరిద్దరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించి వైఎస్ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు.

Also Read: డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరిన కమల హాసన్ పార్టీ