Pensioners Problems : మండుటెండలో పడిగాపులు.. పెన్షన్ కోసం వృద్ధుల తీవ్ర ఇబ్బందులు, మాకెందుకీ కష్టాలు అని ఆవేదన

2, 3 గంటల పాటు లైన్లలో నిల్చున్న లబ్దిదారులు ఎండవేడికి తట్టుకోలేక ఇళ్లకు తిరిగి వెళ్లిపోతున్నారు.

Pensioners Problems : మండుటెండలో పడిగాపులు.. పెన్షన్ కోసం వృద్ధుల తీవ్ర ఇబ్బందులు, మాకెందుకీ కష్టాలు అని ఆవేదన

Pensioners Problems

Pensioners Problems : ఏపీలో పెన్షన్ కోసం లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు తీసుకునేందుకు లబ్దిదారులు పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే సచివాలయాలకు తరలివచ్చిన ప్రజలు క్యూలైన్లలో నిల్చుని పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, చాలాచోట్ల సచివాలయాలకు ఇంకా పెన్షన్ల డబ్బు చేరుకోకపోవడంతో లబ్దిదారులకు నిరాశే ఎదురవుతోంది. 2, 3 గంటల పాటు లైన్లలో నిల్చున్న లబ్దిదారులు ఎండవేడికి తట్టుకోలేక ఇళ్లకు తిరిగి వెళ్లిపోతున్నారు. ఎప్పటిలా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని ఆవేదన చెందుతున్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెన్షన్ల కోసం వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. పెన్షన్లు తీసుకునేందుకు సమయం పడుతుండటంతో టెంట్ ఏర్పాటు చేసి మజ్జిగ అందజేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోనూ పెన్షన్ల కోసం వృద్ధులు బారులుతీరారు. పెన్షన్ డబ్బు కోసం అధికారులు బ్యాంకులకు వెళ్లడంతో వృద్ధులు ఎదురుచూస్తున్నారు. ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు ఇవ్వడమే బాగుందని వృద్ధులు అన్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెన్షన్ల కోసం వృద్ధులు, వితంతవులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. మండుటెండల్లో నిలుచోవాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండవేడికి తట్టుకోలేక పెన్షన్ డబ్బు తీసుకోకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. పల్నాడు జిల్లా గురజాలలో సచివాలయానికి లబ్దిదారులు క్యూ కట్టారు. అయితే, బ్యాంకుల నుంచి నగదు తీసుకొచ్చేందుకు సమయం పడుతుందని.. సచివాలయ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో లబ్దిదారులు నిరాశకు గురయ్యారు. అటు తిరుపతి జిల్లా గూడూరులోనూ పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు పెద్ద ఎత్తున సచివాలయానికి చేరుకున్నారు.

”ఎండలకు అల్లాడిపోతున్నాం. గంటల తరబడి క్యూలో నిల్చుకోలేకపోతున్నాము. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. కనీసం మంచి నీళ్లు ఇచ్చే వారు కూడా లేరు. పనులన్నీ వదులుకుని వచ్చాము. లైన్లలో నిలబడి తోసుకుని కిందపడితే ఎవరు బాధ్యులు? వికలాంగులు, అంధుల పరిస్థితి దయనీయంగా ఉంది” అని వృద్ధులు వాపోయారు.

Also Read : నెల్లూరులో వైసీపీ పెద్ద సాహసం.. విజయం ఖాయమేనా?