కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా? జిల్లా కేంద్రాలను మారుస్తారా?

నిధులు కూడా కేటాయించాలి. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇది అంత త్వరగా అయ్యే పనికాదన్న వాదన వినిపిస్తోంది.

కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా? జిల్లా కేంద్రాలను మారుస్తారా?

Updated On : August 9, 2025 / 8:34 PM IST

జిల్లాల ఇష్యూ ఏపీలో మరోసారి హాట్ టాపిక్‌ అవుతోంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న 26 జిల్లాల‌ను 32 జిల్లాలుగా విభ‌జించ‌డంతో పాటు.. వాటికి కొత్త పేర్లు, రెవెన్యూ డివిజ‌న్ల స‌రిహ‌ద్దుల మార్పు వంటివి..నెల రోజుల్లోనే చేసి తీరాల‌న్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో..డిస్ట్రిక్ట్స్‌ ఇష్యూ చర్చనీయాంశం అవుతోంది. అయితే..కొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పు ఇంత తొంద‌ర‌గా జ‌రుగుతుందా.? అనేది ప్రజల నుంచి ఎదుర‌వుతున్న ప్రశ్న.

గ‌తంలో వైసీపీ కూడా ఇలానే తొంద‌ర‌ప‌డి చేసిన ప‌నికి ఇప్పుడు సమస్య మొదటికి వచ్చిందంటున్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు కూడా హడావుడిగా కాకుండా..ఫ్యూచర్‌లో సమస్యలు రాకుండా..పరిపాలన కేంద్రాలు అందరికీ అందుబాటులో ఉండేలా డెసిషన్ తీసుకోవాలంటున్నారు పబ్లిక్. జిల్లాల స‌రిహ‌ద్దులు నిర్ణయించ‌డం..మార్చడం అంటే..రెండు మూడు జిల్లాల‌కు చెందిన అధికారులు, క‌లెక్టర్లు క‌లిసి తీసుకోవాల్సిన నిర్ణయం. క‌నీసం ఐదారు రోజుల పాటు క‌స‌ర‌త్తు చేసి..ప్రజాభిప్రాయ సేకర‌ణ కూడా చేప‌ట్టాలి. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు..ప్రముఖుల పేర్లు, స్థానికుల సెంటిమెంటును దృష్టిలో పెట్టుకుని జిల్లాల విభ‌జ‌న చేయాలి. దీనికి ఎంత లేద‌న్నా..ఐదు నుంచి ఆరు నెలల టైమ్‌ పట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: 5 పాకిస్థాన్ యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని కూల్చేశాం: తొలిసారి ప్రకటించిన ఐఏఎఫ్‌ చీఫ్‌

వివాదంగా ఉన్న అన్నమయ్య జిల్లా, ప‌ల్నాడు జిల్లా, శ్రీస‌త్యసాయి జిల్లా, కోన‌సీమ‌, మ‌న్యం జిల్లాల ప‌రిస్థితులు డిఫరెంట్‌గా ఉన్నాయి. అక్కడ మార్పులు చేర్పులు చేయాలంటే..నెల రోజుల సమయం అయితే సరిపోదంటున్నారు. రెవెన్యూ డివిజ‌న్ల‌ను మార్చాల‌న్నా.. గ్రామ స‌భ‌ల‌ను పెట్టి.. స‌రైన నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాద‌న‌లు పంపించాల్సి ఉంటుంది. అప్పుడే జిల్లాల పునర్విభజన విభ‌జ‌న ప్రక్రియపై ఓ క్లారిటీ వచ్చే అవ‌కాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో సీఎం చంద్రబాబు చెప్పినట్లు నెల రోజుల స‌మ‌యం స‌రిపోద‌ని..హ‌డావుడిగా ఏ డెసిషన్‌ తీసుకున్నా..కూటమి ప్రభుత్వానికే కాదు..ప్రజలకు కూడా నష్టమేనన్న టాక్ వినిపిస్తోంది.

32 జిల్లాల‌కు పెంచాల‌ని ప్రతిపాద‌న‌
ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి. వీటిని 32 జిల్లాల‌కు పెంచాల‌న్నది ఒక ప్రతిపాద‌న‌. దీనిపై స‌ర్కారు ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మంత్రి అన‌గాని స‌త్యప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రివ‌ర్గ ఉపసంఘాన్ని వేశారు. రాష్ట్ర విభ‌జ‌న నాటికి 13 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. వైసీపీ హ‌యాంలో పార్లమెంట్‌ నియోజ‌క‌వ‌ర్గాల ప్రాతిప‌దిక‌గా..25 జిల్లాలు చేశారు. అర‌కు పార్లమెంట్‌ పరిధి విస్తీర్ణం ఎక్కువగా ఉండ‌టంతో దానిని రెండు జిల్లాలు చేశారు. మిగిలిన పార్లమెంటు స్థానాల‌ను యాజ్‌టీస్‌గా ఉంచి..వాటిని జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అయితే.. జిల్లాల విభ‌జ‌న‌తో ఇబ్బందులేమి రాకున్నా..కొత్త జిల్లా కేంద్రాల విష‌యంలోనే సమస్యలు వ‌చ్చాయి.

చాలా జిల్లాల‌కు నిర్ణయించిన‌..జిల్లా కేంద్రాల‌పై ప్రజ‌ల నుంచి వ్యతిరేక‌త వ‌చ్చింది. తాము అధికారంలోకి వ‌చ్చాక‌.. వాటిని మారుస్తామ‌ని చంద్రబాబు స‌హా..యువ‌గ‌ళం పాదయాత్రలో నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప‌ని మీదే ఉంది ప్రభుత్వం. కానీ కొత్త జిల్లాలపై డైల‌మాలో ఉందట సర్కార్. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే..ప్రభుత్వ ఆఫీసులు, మ‌రింత మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు స‌హా..ఉద్యోగులు, సిబ్బంది అవ‌స‌రం ఉంటుంది. దీనికి తోడు..నిధులు కూడా కేటాయించాలి. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇది అంత త్వరగా అయ్యే పనికాదన్న వాదన వినిపిస్తోంది.

ప్రస్తుతానికి జిల్లా కేంద్రాల‌ను మార్చేసి..కొత్త జిల్లాల ఏర్పాటును వాయిదా వేస్తేనే బెటర్ అని పలువురు మంత్రులు సీఎం చంద్రబాబుకు సూచించారట. అయితే ఎమ్మెల్యే బాల‌య్య..హిందూపురంను జిల్లాగా చేసి..ఎన్టీఆర్ పేరు పెట్టాల‌ని కోరుతున్నారట. అలాగే మార్కాపురం జిల్లా కేంద్రం మార్పుతో పాటు..ప్రత్యేకంగా ఒక జిల్లా ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ ఉంది. ఇలా ఈ జిల్లాల‌ను ఏర్పాటు చేస్తే..ప‌ల్నాడు స‌హా.. మ‌న్యం, ఏలూరు జిల్లాల్లోనూ..ఇలాంటి డిమాండ్లే ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు జిల్లాల విభజన జోలికి వెళ్లకపోవడమే బెటర్ అనుకుంటున్నారట.

ప్రస్తుతానికి జిల్లా కేంద్రాల ఏర్పాటు, స‌రిహ‌ద్దుల మార్పునకే ప‌రిమితం కావాల‌ని భావిస్తున్నారట. అయితే వ‌చ్చే ఏడాది మార్చి 31 త‌ర్వాత రెండేళ్ల పాటు స‌రిహ‌ద్దులు మార్చడానికి వీళ్లేద‌ని కేంద్రం తేల్చి చెప్పింది. వ‌చ్చే ఏడాది ఫిబ్రవ‌రి నుంచే కులగ‌ణ‌న స్టార్ట్ కానుంది. త‌ర్వాత‌..ఏడాది పాటు జ‌నగ‌ణ‌న చేస్తారు. ఈ నేప‌థ్యంలో త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ భారం పెట్టుకోవ‌డం స‌రికాద‌న్న అప్రాయాలు కూడా ఉన్నాయట. కూటమి సర్కార్ డెసిషన్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.