5 పాకిస్థాన్ యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని కూల్చేశాం: తొలిసారి ప్రకటించిన ఐఏఎఫ్‌ చీఫ్‌

పాక్‌తో కొన్ని దశాబ్దాల తర్వాత జరిగిన అత్యంత తీవ్రమైన సైనిక ఘర్షణ ఇది. ఘర్షణలపై భారత్ ఇలాంటి ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. 

5 పాకిస్థాన్ యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని కూల్చేశాం: తొలిసారి ప్రకటించిన ఐఏఎఫ్‌ చీఫ్‌

Updated On : August 9, 2025 / 7:53 PM IST

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ ఆపరేషన్ సిందూర్‌ చేపట్టి దాడులు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన ఘర్షణల్లో 5 పాకిస్థాన్ యుద్ధ విమానాలను, అలాగే ఒక పెద్ద విమానాన్ని భారత్ కూల్చిందని భారత వాయుసేన అధిపతి శనివారం తెలిపారు.

ఆ పెద్ద విమానం ELINT లేదా AEW&C విమానం కావొచ్చని తెలిపారు. దాన్ని సుమారు 300 కి.మీ. దూరంలో కూల్చామని అన్నారు. ELINT విమానం అంటే శత్రు ఎలక్ట్రానిక్‌ సిగ్నల్‌ సమాచారాన్ని సేకరించే ప్రత్యేక విమానం. AEW&C విమానం అంటే గగనతల పర్యవేక్షణ, నియంత్రణ కోసం ఉపయోగించే ప్రత్యేక విమానం.

పాక్‌తో కొన్ని దశాబ్దాల తర్వాత జరిగిన అత్యంత తీవ్రమైన సైనిక ఘర్షణ ఇది. ఘర్షణలపై భారత్ ఇలాంటి ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. పాకిస్థాన్ యుద్ధ విమానాల్లో అధిక శాతం ఫైటర్‌ జెట్లను ఎస్-400 క్షిపణి వ్యవస్థ ద్వారా కూల్చామని భారత వాయుసేన మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు. ఈ దాడులను ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ డేటా ధ్రువీకరిస్తోందని అన్నారు.

Also Read: ఢిల్లీలో భారీ వర్షం.. గోడ కూలి 8 మంది మృతి

బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వాయుసేన మార్షల్ ఏపీ సింగ్ పాల్గొని ఈ వివరాలు తెలిపారు. ఏ రకమైన యుద్ధవిమానాలను కూల్చామన్న విషయాన్ని సింగ్ వెల్లడించకపోయినా, ఓ పర్యవేక్షణ విమానం( ELINT లేదా AEW&C), అలాగే పాకిస్థాన్ ఆగ్నేయంలో ఉన్న రెండు వాయుసేన స్థావరాల్లో హ్యాంగర్లలో నిలిపిన కొన్ని ఎఫ్-16 యుద్ధవిమానాలు కూడా దాడిలో నష్టపోయాయని చెప్పారు.

చైనా తయారీ యుద్ధ విమానాలు, అమెరికా ఎఫ్-16లను పాకిస్థాన్‌ ప్రధానంగా వాడుతోంది. మే 7-10 మధ్య భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణలో భారత్ తమ విమానాలను కూల్చలేదని పాకిస్థాన్ చెప్పుకొచ్చింది.

అంతేగాక, ఈ ఘర్షణలో తాము ఆరు భారత విమానాలను కూల్చామని, అందులో ఒక ఫ్రాన్స్ తయారీ రఫేల్ యుద్ధవిమానం కూడా ఉందని బీరాలు పలికింది. పాక్ ప్రకటనలను భారత్ ఖండించింది.