Minister Ambati Rambabu : కేంద్రం చెప్పిందే ఫైనల్.. తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు-మంత్రి అంబటి రాంబాబు

విద్యుత్ బకాయిలపై కేంద్ర ప్రభుత్వం చెప్పిందే ఫైనల్ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Minister Ambati Rambabu : కేంద్రం చెప్పిందే ఫైనల్.. తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు-మంత్రి అంబటి రాంబాబు

Updated On : August 30, 2022 / 8:45 PM IST

Minister Ambati Rambabu : విద్యుత్ బకాయిల అంశం తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేసింది. ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలి అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించడం వివాదాస్పదమైంది. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీకి మేము చెల్లించడం కాదు ఏపీనే మాకు ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది.

తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. విద్యుత్ బకాయిలపై కేంద్ర ప్రభుత్వం చెప్పిందే ఫైనల్ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీకి రూ.6వేల కోట్లు చెల్లించాలని కేంద్రం చెప్పాక తమకు రూ.12వేల కోట్లు ఏపీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అంటోందని మంత్రి అంబటి ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెల రోజుల్లో విద్యుత్ బకాయిలను చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏపీకి చెల్లించాల్సిన రూ.3,441.78 కోట్లతో పాటు సర్ చార్జీని కూడా కలిపి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2014 జూన్ 2నుండి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యుత్ ను సరఫరా చేసినందుకు డబ్బులు చెల్లించలేదని ఆ రాష్ట్రం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో విద్యుత్ సరఫరాకు సంబంధించి రూ.3,441.78 కోట్లు చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. అంతేకాదు సకాలంలో ఈ నిధులు చెల్లించనందుకు లేటు ఫీజు కింద అదనంగా రూ.335.14 కోట్లు కూడా చెల్లించాలంది.

ఏపీకి విద్యుత్ బకాయిల కింద మొత్తం రూ.6,756.92 కోట్లు (రూ. 3,441.78 కోట్లు+రూ.3,315.14 కోట్లు (సర్ చార్జి)) 30 రోజుల్లోగా చెల్లించాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశంపై తెలంగాణ ప్రభుత్వం ఫైర్ అయ్యింది. కేంద్రం ఆదేశంపై న్యాయ పోరాటం చేస్తామంది. తెలంగాణలో విద్యుత్ కోతలు రావాలని కేంద్రం కుట్రలు చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్ర సర్కార్ ఈ ఉత్తర్వులు జారీ చేసిందని ధ్వజమెత్తింది. వనరుల వినియోగంతో దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే కేసీఆర్ వ్యాఖ్యలు బీజేపీకి రుచించడం లేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతున్నందునే తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుందని ఆరోపణలు చేశారు.

రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 నిబంధనల మేరకు కేంద్రం ఆదేశాలతో తెలంగాణకు ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేసిందని పేర్కొన్న కేంద్రం.. విభజన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం బకాయిలు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. విభజన జరిగిన తర్వాత విద్యుత్ సరఫరా జరిగిందని, కాబట్టి విభజన వివాదాలతో దీనిని ముడిపెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కాబట్టి 30 రోజుల్లో మొత్తం బకాయిలను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.

అయితే, తెలంగాణ వాదన మరోలా ఉంది. విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలు తెలంగాణ పరిధిలోని కేంద్రీయ విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) పరిధిలో ఉన్నాయని తెలంగాణ విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు విద్యుత్ సంస్థలు రుణాలు తీసుకున్నాయని పేర్కొన్నాయి. ఈ రుణాల చెల్లింపునకు తీసుకున్న మొత్తం రూ.12,941 కోట్లు ఉంటుందని, ఈ లెక్కన ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సిన బకాయిల కంటే ఇవే ఎక్కువని, కాబట్టి ఏపీకి బకాయిలు చెల్లించే ప్రశ్నే లేదని గతంలో పలుమార్లు పేర్కొన్నాయి. అయితే, ఇప్పుడు కేంద్రం ఆదేశాలతో తప్పక చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది.