Prasad Thotakura: తోటకూర ప్రసాద్ కు హుస్సేన్ షా కవి స్మారక పురస్కారం.. ప్రవాసాంధ్రులందరికీ దక్కిన గౌరవం..

Prasad Thotakura: తోటకూర ప్రసాద్ కు హుస్సేన్ షా కవి స్మారక పురస్కారం.. ప్రవాసాంధ్రులందరికీ దక్కిన గౌరవం..

Prasad Thotakura Awarded with Hussain Shah Kavi Puraskaram

Updated On : September 12, 2023 / 5:24 PM IST

Thotakura Prasad: కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి (Kavisekhara Umar Alisha) ఏటా అందిస్తున్న హుస్సేన్ షా కవి స్మారక సాహితీ పురస్కారాన్ని 2023కు గాను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) పూర్వాధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్ కు ప్రదానం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో (Pithapuram) సెప్టెంబర్ 9న జరిగిన పురస్కార ప్రదానోత్స కార్యక్రమంలో తోటకూర ప్రసాద్ ఈ అవార్డు అందుకున్నారు.

ఈ సందర్భంగా పురస్కారగ్రహీత తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎందరో సుప్రసిద్ధ సాహితీవేత్తలు, పండితులు, అవధానులు, భాషాసేవకులు ఈ పురస్కారం అందుకున్న వారిలో ఉన్నారని వెల్లడించారు. అంతటి చరిత్రగల్గిన పరంపరలో తాను ఈ పురస్కారం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతమని, ఇది ప్రవాసాంధ్రులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ పురస్కారానికి తనను ఎంపిక చేసిన సాహితీ సమితి సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


550 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రగల్గిన శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక, సాహిత్య, సేవాకృషి చేస్తున్న విశిష్టవ్యక్తి ప్రస్తుత నవమ పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా మానవాళికి మార్గదర్శనంగా నిలుస్తున్నారని వెల్లడించారు. సిరివెన్నెల కుటుంబ సభ్యుల సహకారంతో తానా సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రచురించిన ప్రముఖ కవి పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం మొత్తం 6 సంపుటాలను శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం గ్రంధాలయానికి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి తానా కానుకగా తోటకూర ప్రసాద్ అందజేశారు.

Also Read: రైల్ కోచ్ రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది.. ఎక్కడో తెలుసా?

ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, పీఠం కేంద్ర కమిటీ సభ్యులు డా. పింగళి ఆనందకుమార్, ఎన్. టి. వి. ప్రసాద వర్మ, ఏవీవీ సత్యనారాయణ, తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, పద్యకవి వామరాజు సత్యమూర్తి, సాహితీ విమర్శకుడు రోచిష్మాన్ శర్మ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డా. కె. పద్మరాజు, జేఎన్టీయూ విశ్రాంత ఆచార్యులు డా. ఈశ్వర్ ప్రసాద్, డా. ఏలూరి శ్రీనివాస్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ చైర్ పర్సన్ వి. మాధవి, సాహితీ సమితి కార్యదర్శి దాయన సురేష్ చంద్రజీ, ఉపాధ్యక్షుడు త్సవటపల్లి మురళీకృష్ణ, కోశాధికారి వడ్డాది శ్రీ వెంకటేశ్వర శర్మ, వేగేశ్న సత్యవతి, వడ్డి విజయలక్ష్మి, త్సవటపల్లి సాయి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఆ సాలెపురుగును చూస్తే అదృష్టం.. మహిళకు తగిలిన బంపర్ లాటరీ