తెలుగమ్మాయిని మెచ్చుకుని,సత్కరించిన ట్రంప్

  • Published By: venkaiahnaidu ,Published On : May 19, 2020 / 06:36 AM IST
తెలుగమ్మాయిని మెచ్చుకుని,సత్కరించిన ట్రంప్

Updated On : May 19, 2020 / 6:36 AM IST

కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న అగ్రరాజ్యంలో వయసుకుమించిన గొప్ప సేవ చేస్తున్న తెలుగు బాలికను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసించారు. తన గర్ల్స్‌ స్కౌట్స్‌ బృందం తో కలిసి కొన్ని రోజులుగా నర్సులు,ఫైర్ ఫైటర్స్ కు ఆహారం అందిస్తూ, అమెరికాలో కరోనా మహమ్మారిపై పోరాడుతున్న హెల్త్ కేర్ వర్కర్లకు స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డులను పంపిస్తున్న ఇండియన్-అమెరికన్  శ్రావ్యా అన్నపురెడ్డి(10)ను ట్రంప్ మెచ్చుకుని సత్కరించారు.

గత శుక్రవారం కరోనాపై పోరులో సేవలందిస్తున్న వారి అభినందన సభలో శ్రావ్య, తదితరులను అభినందించారు.  శ్రావ్య తల్లి సీత స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లాలోని నరసయ్యపాలెం. మేరీల్యాండ్ లోని హానోవర్ హిల్స్ ఎలిమెంట్రీ స్కూల్ లో శ్రావ్యా 4వ తరగతి చదువుతోంది. ఈ సందర్భంగా ఆ బాలిక మాట్లాడుతూ… తన తల్లిదండ్రులు తనకు భారతీయ సంస్కృతులను నేర్పుతూ పెంచారని తెలిపింది.ట్రంప్ చేతుల మీదుగా శ్రావ్యకు సన్మానం జరగడంపై చిన్నారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

కాగా,మరోవైపు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్నది. అగ్రరాజ్యంలోని మొత్తం 50 రాష్ర్టాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక కేసులు,మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు 15లక్షల 50వేల 294కేసులు నమోదుకాగా,91వేల 981మంది చనిపోయారు.

ఇది కరోనా వైరస్‌తో ప్రపంచ మొత్తం నమోదైన మరణాల్లో మూడో వంతు కావడం గమనార్హం. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే అత్యధికంగా 3లక్షల 61వేల 266కేసులు,28వేల 480మరణాలు నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా 3లక్షల 56వేల383మంది అమెరికాలో కరోనా నుంచి కోలుకున్నారు.

Read: డాక్టర్లు వద్దన్నారు..నాకు నచ్చిందని హైడ్రాక్సీక్లోరోక్విన్ వేసుకుంటున్నా