Rajamundry Lok Sabha Constituency : గోదారి తీరంలో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది…రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానంపై వైసీపీ పట్టు నిలుపుకుంటుందా?
అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 దశాబ్దాలుగా రెడ్డి సామాజికవర్గ నేతలదే హవా నడుస్తోంది. సత్తి సూర్యనారాయణ రెడ్డి.. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనపర్తి రాజకీయంలో అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అంతా ఇంతా కాదు. టీడీపీ ఇంచార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మధ్య అవినీతి విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయ్.

Rajamahendravaram Politics
Rajamundry Lok Sabha Constituency : తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు రాజమహేంద్రవరం. ఇక్కడి రాజకీయం ఎప్పుడూ వైవిధ్యమే.. ఓటర్ తీర్పు ఎప్పుడూ విలక్షణమే ! గత ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలను బద్దలుకొట్టి వైసీపీ పాగా వేసింది. మరి ఇప్పుడు అధికార పార్టీని నిలబెట్టుకుంటుందా.. రాజమహేంద్రవరం ఎంపీ బరిలో నిలిచేది ఎవరు.. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయం ఎలా ఉంది.. వైసీపీని ఇబ్బంది పెడుతోంది ఏంటి.. సైకిల్ పార్టీ దృష్టిసారించాల్సింది ఏంటి.. టీడీపీ, జనసేన కలిస్తే రాజమహేంద్రవరం పరిధిలోని ప్రతీ అసెంబ్లీలోనూ వైసీపీకి గడ్డు పరిస్థితులు తప్పవా.. ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో దిగబోతున్నారు.. ఏ పార్టీ బలం ఏంటి, బలహీనతలు ఏంటి..
వైసీపీ తరఫున పార్లమెంట్ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపని భరత్…రాజమహేంద్రవరం సిటీ నుంచి పోటీకి ఏర్పాట్లు
తెలుగు సాహిత్యానికి కేరాఫ్.. రాజమహేంద్రవరం. రాజకీయంగా ఈ ప్రాంతానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఓటర్ల తీర్పు ప్రతీసారి విలక్షణంగా కనిపిస్తుంటుంది ఇక్కడ ! రాజమహేంద్రవరం ఎంపీగా ఎక్కువసార్లు చౌదరి సామాజికవర్గం చెందిన నేతలే విజయం సాధించారు. ఆ సంప్రదాయాన్ని గత ఎన్నికల్లో వైసీపీ బద్దలు చేసింది. బీసీ అభ్యర్థిని నిలబెట్టి.. అద్భుత విజయం సాధించింది. రాజమహేంద్రవరంలో మార్గాని భరత్.. సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మాగంటి రూపపై లక్షా 20 వేలకు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించారు. భరత్ ఆర్ధిక బలానికి జగన్ వేవ్ తోడు కావడంతో సూపర్ విక్టరీ సాధించారు. వైసీపీ తరఫున పార్లమెంట్ చీఫ్ విప్‌గా ఉన్నారు. మార్గాని భరత్ మరోసారి పార్లమెంట్ బరిలో నిలిచేందుకు ఆసక్తి లేనట్లు కనిపిస్తున్నారు. రాజమహేంద్రవరం సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ తరఫున ఎంపీ బరిలో నిలిచేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.

Rajamundry Lok Sabha Constituency
మరోసారి బీసీ అభ్యర్థినే బరిలోకి దింపే ఆలోచనలో వైసీపీ… టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు, బుచ్చయ్య చౌదరి పేర్లు
రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానంలో వైసీపీ మరోసారి బీసీ అభ్యర్థినే బరిలోకి దింపే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రాంచంద్రపురం ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను.. ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం పార్టీలో నడుస్తోంది. ఆయనతో పాటు గన్నమనేని వెంకటేశ్వరరావు, అవంతీ సీ ఫుడ్స్ అధినేత అల్లూరి ఇంద్రకుమార్ చౌదరి పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయ్. ఒకవేళ ఈ స్థానాన్ని కాపులకు కేటాయించే చాన్స్ ఉంటే.. నిడదవోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస నాయుడికి ఎంపీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయ్. టీడీపీ తరఫున గత ఎన్నికల్లో మాగంటి రూప పోటీ చేయగా.. ఎలక్షన్స్ తర్వాత ఆమె రాజమహేంద్రవరం వైపు కూడా చూడలేదు. దీంతో ఈసారి పోటీలో ఆదిరెడ్డి వాసు, బుచ్చయ్య చౌదరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయ్. ఇద్దరిలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా.. ఆ ప్రభావం అసెంబ్లీ స్థానాల్లో కనిపించే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, టీడీపీ పొత్తు కుదిరితే.. రాజమహేంద్రవరం నుంచి బీజేపీ అభ్యర్థి పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయ్.
రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీలతో పాటు.. అనపర్తి, రాజానగరం, కోవ్వూరు, నిడదవోలు, గోపాలపురం స్థానాలు ఉన్నాయ్. ఇందులో కోవ్వూరు, గోపాలపురం ఎస్సీ రిజర్వ్‌డ్ కాగా.. మిగిలినవి జనరల్ స్థానాలు.

bhavani
రాజమహేంద్రవరం రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవాని.. వచ్చే ఎన్నికల్లోనూ భవానీ బరిలో దిగే చాన్స్
లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజమహేంద్రవరం సిటీ అత్యంత కీలకం. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఆదిరెడ్డి భవాని.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ భవానీ టీడీపీ నుంచి మళ్లీ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయ్. ఐతే ప్రజాసమస్యలపై అంతగా స్పందించపోవడం, పార్టీ కార్యక్రమాలతో పాటు నగర వ్యవహారాల్లో తన భర్త వాసు చొరవ చూపించడంలాంటివి.. భవానిపై కాస్త వ్యతిరేకతకు కారణం అయ్యాయనే చర్చ జరుగుతోంది. జనసేనతో పొత్తు కుదిరి.. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే.. ఇక్కడ టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్. రాజమహేంద్రరం సిటీలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆదిరెడ్డి కుటుంబానికి టికెట్ ఇవ్వకపోటే.. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయ్. రాజమహేంద్రవరం రూరల్‌తో పాటు సిటీలోనూ గోరంట్లకు ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఉంది.

suryaprakash
వైసీపీ తరఫున గత ఎన్నికల్లో రౌతు సూర్యప్రకాశ్ పోటీ.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య వివాదంతో టెన్షన్
రాజమహేంద్రవరం సిటీ నుంచి వైసీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన రౌతు సూర్యప్రకాష్.. ఆ తర్వాత పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఎంపీ మార్గాని భరత్ ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. అధిష్టానంతో పాటు.. ఓటర్లను ప్రసన్నం చేసేకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీఎం జగన్ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్లు కనిపిస్తోంది. గుడ్ మార్నింగ్ రాజమండ్రి కార్యక్రమం పేరుతో జనాలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్న భరత్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఐతే సొంత పార్టీ నేతలతోనే వివాదాలకు తెరలేపుతూ వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారన్న ప్రచారం వినిపిస్తోంది. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య వివాదం సీఎం వరకు వెళ్లింది. ఐనా మంటలు రేగుతూనే ఉన్నాయ్. ఈ విభేదాలు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయ్. టీడీపీకి కంచుకోట అయిన రాజమహేంద్రవరాన్ని వైసీపీ ఖాతాలో వేయాలంటే అంత ఈజీకాదు. ఏమైనా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

buchaiah chowdary
రాజమహేంద్రవరం రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్యచౌదరి,.. పొత్తు కుదిరితే ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశం
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గోరంట్ల బుచ్చయ్యచౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన గోరంట్ల.. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. సిట్టింగ్‌లకు టికెట్ ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నా.. పొత్తు కుదిరితే ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంటి జనసేన తరఫున పోటీ చేసిన కందుల దుర్గేశ్.. 42వేలకు పైగా ఓట్లు సాధించారు. జిల్లా రాజకీయాల్లోనూ దుర్గేశ్‌ది కీలక పాత్ర కావడంతో.. ఈ స్థానం కోసం జనసేన పట్టు పట్టే అవకాశాలు ఉన్నాయ్. రూరల్ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తే.. గోరంట్ల ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆకుల వీర్రాజు.. అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. వైసీపీ కో ఆర్డినేటర్ పదవి నుంచి కూడా తొలగించడంతో.. ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయ్. ప్రస్తుతం చందన నాగేశ్వరరావు వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. గడప గడపకు తిరుగుతున్నా.. ఆశించిన స్థాయిలో జనాల మనసు గెలుచుకోలేకపోయారనే విమర్శలు ఉన్నాయ్. సర్వేలు కూడా ఆయనకు పాజిటివ్‌గా కనిపించడం లేదు. దీంతో అధికార పార్టీ మరో నాయకుడి కోసం అన్వేషణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎవరిని నిలబెట్టినా.. టీడీపీ, జనసేన పొత్తుగా బరిలోకి దిగితే ఢీకొట్టి విజయం సాధించడం చాలా కష్టం.

Jakkampudi Raja
రాజానగరంలో జక్కంపూడి రాజాకు మళ్లీ టికెట్ ఖాయం..గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడి నుంచి పోటీ చేసే చాన్స్
రాజానగరంలో జక్కంపూడి రాజా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో జక్కంపూడి ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాజా.. ప్రభుత్వ పథకాలను జనాలకు చేరువ చేయడంలో చురుకుగా కనిపించారు. సొంతసామాజికవర్గం అయిన కాపులకే ఆయన పెద్దపీట వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్. ఎస్సీ సామాజికవర్గంలో కొంత వ్యతిరేకత ఉన్నట్లు సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఎంపీ భరత్‌తో.. జక్కంపూడి రాజాకు వివాదం చెలరేగడం పార్టీలో కొత్త చర్చకు కారణం అయింది. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఐతే సర్వేల్లో పాజిటివ్‌గా రావడంతో.. మళ్లీ జక్కంపూడి రాజాకు టికెట్ ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన పెందుర్తి వెంకటేశ్.. ఇంచార్జి పదవికి రాజీనామా చేశారు. దీంతో టీడీపీ తరఫున ఎవరు బరిలో నిలుస్తారన్నది ఆసక్తి రేపుతోంది. రాజమహేంద్రవరం రూరల్ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తే.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఇక్కడ జనసేన కూడా బలంగానే ఉంది. బత్తుల బలరామకృష్ణుడు జనసేనలో కీలకపాత్ర పోషిస్తున్నారు. పొత్తులో భాగంగా తనకు టికెట్ దక్కుతుందని బత్తుల ధీమాగా ఉన్నారు. దీంతో ఇక్కడి నుంచి ఏ పార్టీ బరిలో దిగుతుందన్నది హాట్‌టాపిక్ అవుతోంది. గత ఎన్నికల్లో రాజానగరం రాజకీయాల్లో ద్వంద్వ వైఖరి కనిపించిందనే చర్చ ఉంది. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన రాయపరెడ్డి ప్రసాద్.. వైసీపీ అభ్యర్దికి పూర్తిస్థాయిలో పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయ్. ఇప్పుడు బల రామకృష్ణుడికి టికెట్ దక్కితే.. వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసే చాన్స్ ఉందనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. జక్కంపూడి రాజాకు ఒకప్పుడు బలరామకృష్ణుడు ముఖ్య అనుచరుడిగా ఉండడం.. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుందనే చర్చ జరుగుతోంది.

suryanarayanareddy., ramakrishnareddy
అనపర్తిలో మరోసారి బరిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సత్తి సూర్యనారాయణ రెడ్డి… టీడీపీ తరఫున నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి
అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 దశాబ్దాలుగా రెడ్డి సామాజికవర్గ నేతలదే హవా నడుస్తోంది. సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనపర్తి రాజకీయంలో అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అంతా ఇంతా కాదు. టీడీపీ ఇంచార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మధ్య అవినీతి విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయ్. ఓ స్థాయిలో ప్రమాణాల వరకు వెళ్లింది మాటల యుద్ధం ! ప్రభుత్వ పథకాలను జనాల్లోకి పూర్తిస్థాయిలో తీసుకెళ్లడంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సక్సెస్ అయ్యారు. జగన్ సర్వేలోనూ ఆయనకు మంచి మార్కులే పడ్డాయ్. దీంతో మళ్లీ ఆయనే పోటీ దిగడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ తరఫున నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి యాక్టివ్‌గా ఉండడంతో.. మళ్లీ ఆయనకే టికెట్ దక్కడం కన్ఫార్మ్ ! టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే.. ఈ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి పోటీ ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది.

talari venkat rao
గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా తలారి వెంకట్రావుపై నియోజకవర్గంలో వ్యతిరేకత.. టీడీపీలో విభేదాలు వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు
గోపాలపురం అసెంబ్లీలో తలారి వెంకట్రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. అలాంటి స్థానంలో సైకిల్ పార్టీకి ఝలక్ ఇస్తూ.. తలారి వెంకట్రావు సూపర్ విక్టరీ సాధించారు. ఐతే సిట్టింగ్ ఎమ్మెల్యేపై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగింది. టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సొంత పార్టీలోనే లుకలుకలు మొదలయ్యాయ్. టీడీపీలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయ్. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును ఇంచార్జి పదవి నుంచి తొలగించి.. మద్దిపాటి వెంకటరాజుకు బాధ్యతలు అప్పగించారు. దీంతో గోపాలపురం టీడీపీలో గ్రూపులు మొదలయ్యాయ్. సైకిల్ పార్టీ నేతల మధ్య వర్గపోరు పీక్స్‌కు చేరింది. టీడీపీలో విభేదాలు వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఐతే ఇక్కడి నుంచి పోటీకి జనసేన కూడా సై అంటుండడంతో.. పొత్తు కుదిరితే ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనసేన పొత్తు కుదిరి పోటీకి దిగితే.. వైసీపీకి గట్టి పోటీ ఎదురుకావడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

talari venkat rao
కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి తానేటి వనితపై సొంతపార్టీలోనే కొంత అసంతృప్తి! టీడీపీ నుంచి రేసులో జవహర్
టీడీపీకి కంచుకోట అయిన కొవ్వూరులోనూ గత ఎన్నికల్లో వైసీపీ పాగా వేసింది. మంత్రి తానేటి వనిత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వనితపై సొంతపార్టీలోనే కొంత అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. అటు తన సొంత నియోజకవర్గం అయిన గోపాలపురం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వనిత ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొవ్వూరులో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం మైనస్‌గా మారే చాన్స్ ఉంది. స్థానిక ఆసుపత్రిలో సరైన వసతులు లేకపోవడం.. పారిశుద్ధ్యం పడకేసిందని.. పీఎస్‌లో సిబ్బంది కొరతలాంటి అంశాలను హైలైట్ చేస్తూ.. వనితను కార్నర్ చేసేందుకు విపక్ష నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే జవహర్‌ను పక్కనపెట్టి.. వంగలపూడి వనితకు అవకాశం ఇచ్చింది టీడీపీ. ఆ ప్రయోగం బెడిసి కొట్టింది. దీంతో ఇక్కడ జవహర్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. దీంతో టికెట్ కోసం టీడీపీలో భారీగా ఆశావహులు కనిపిస్తున్నారు. జవహర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు.. జీజీ చలం, ముప్పిడి రాజు, ముప్పిడి వాసుదేవరావు, రాపాక సుబ్బారావు, కొల్లి రమేష్, వేముల వెంకట్రావు, పెనుమాక జయరాజు, కొప్పాక జవహర్ టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా విభాగంలోకౌన్సిలర్ పాలూరు నీలమ కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. 2019లో ఇక్కడి నుంచి పోటీ చేసిన అనిత.. ఈసారి పాయకరావుపేట నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయ్. టీడీపీలో టికెట్ ఫైట్ ఎక్కువగా ఉండడంతో.. గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయ్. ఇది ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయ్. జనసేన నుంచి అడ్వకేట్ తొర్లపాటి శీతల్ టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే.. వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురుకావడం ఖాయం.

Srinivasa Naidu, sesharao
నిడదవోలులో ప్రజలకు అందుబాటులో ఉండని సిట్టింగ్ ఎమ్మెల్యేగా జవ్వాది శ్రీనివాస నాయుడు.. టీడీపీ నుంచి మరోసారి టికెట్ ఆశిస్తున్న బూరుగుపల్లి శేషారావు
నిడదవోలులో జవ్వాది శ్రీనివాస నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ తరఫున మళ్లీ ఆయనే బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే నియోజకవర్గంలో సరిగ్గా ఉండకపోవటం, జనాలకు అందుబాటులో లేకపోవడం, సమస్యలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు శ్రీనివాస్ నాయుడుకు మైనస్. పార్టీ మీద కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయ్. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన బూరుగుపల్లి శేషారావు మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటు కుందుల సత్యనారాయణ, దొరయ్య వీరు పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయ్. ముగ్గురు నేతలు తమకే టికెట్ అంటూ ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో నియోజకవర్గ టీడీపీలో గ్రూప్ వార్ ఎక్కువగా కనిపిస్తోంది. చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటించిన సమయంలోనూ తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య వర్గపోరు బయటపడింది. టీడీపీ, జనసేన పొత్తులు కుదిరితే.. నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థి బరిలోకి దిగే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ జరుగుతోంది. జనసేన నుంచి ప్రియా సౌజన్య, చేగొండి సూర్య ప్రకాష్ టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. వైసీపీకి ఇక్కడ కూడా గట్టి పోటీ తప్పేలా లేదు.