రాజానగరంలో టైట్ ఫైట్.. ఒకప్పటి సహచరుల మధ్య ఆసక్తికర పోరు

రాజాకు ప్రత్యర్థిగా తలపడుతున్న జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కూడా ఒకప్పుడు వైసీపీలో పనిచేసిన వారే.. ఒకప్పటి సహచరులే ఇప్పుడు ముఖాముఖి తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది.

రాజానగరంలో టైట్ ఫైట్.. ఒకప్పటి సహచరుల మధ్య ఆసక్తికర పోరు

Rajanagaram Assembly Constituency Ground Report

Rajanagaram Assembly constituency: రాజానగరం రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఒకప్పటి సహచరులు.. నేరుగా తలపడుతుండటంతో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరోమారు పోటీ చేస్తుండగా, జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ తపడుతున్నారు. రాజా, బలరామకృష్ణ ఇద్దరూ గతంలో వైసీపీలోనే ఉండేవారు.. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో బలరామకృష్ణ జనసేన పంచన చేరారు. ఇక ఒకప్పటి సహచరుల మధ్య సమరం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది.

ప్రశాంత గోదావరి తీరంలో ఉత్కంఠ పోరుకు వేదిక కానుంది రాజానగరం నియోజకవర్గం. 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో అధికార, విపక్షాల మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ కనిపిస్తోంది. రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు టీడీపీ, ఓ సారి వైసీపీ గెలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గత ఎన్నికల్లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టగా, అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో రాజా తల్లి విజయలక్ష్మి పరాజయం పాలయ్యారు. ఐతే ఈసారి కచ్చితంగా గెలుస్తాననే ధీమా కనబరుస్తున్నారు రాజా.. రాజానగరం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కాగా, ఆ తర్వాత స్థానంలో బీసీలు జనాభా అధికం. ఇక కమ్మ సామాజిక వర్గం కూడా ఇక్కడ గెలుపోటములను నిర్ణయించనుంది.

ఎమ్మెల్యే జక్కంపూడి రాజాది బలమైన కుటుంబ నేపథ్యం. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ చట్టసభల సభ్యులుగా పనిచేశారు. నియోజకవర్గంలో బలమైన క్యాడర్, సామాజిక వర్గ మద్దతు ఉంది. ఇక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో మళ్లీ తనదే గెలుపు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజా. ఐతే రాజమండ్రి ఎంపీ మార్గని భరత్‌తో రాజాకు విభేదాలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా ఉప్పు-నిప్పులా వ్యవహరిస్తుంటారు. బీసీ వర్గానికి చెందిన భరత్ వల్ల రాజాకు ఏమైనా నష్టం జరుగుతుందా? అన్న సందేహాలు ఉన్నాయి. ఇక రాజాకు ప్రత్యర్థిగా తలపడుతున్న జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కూడా ఒకప్పుడు వైసీపీలో పనిచేసిన వారే.. ఒకప్పటి సహచరులే ఇప్పుడు ముఖాముఖి తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది.

కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే రాజా.. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా రాజాకు గుర్తింపు ఉంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తన విజయం పక్కా, అని నమ్ముతున్నారు రాజా.. ఐతే జనసేన కూడా ఈ నియోజకవర్గం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతనే బరిలోకి దింపుతోంది. టీడీపీకి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. కాపు ఓట్లతోపాటు టీడీపీ ఓటు సక్రమంగా బదిలీ అయితే జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ భావిస్తోంది.

Also Read: కచ్చితంగా పోటీ చేస్తా.. చంద్రబాబు నిర్ణయంతో కలత చెందా- బోరున విలపించిన మాజీ ఎమ్మెల్యే

ఇక జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కూడా వైసీపీ నుంచి వచ్చిన నేతే.. గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన బలరామకృష్ణకు వైసీపీ లోటుపాట్లపై సంపూర్ణ అవగాహన ఉంది. ఇక తన సొంత సామాజిక వర్గం మద్దతు, టీడీపీ-జనసేన కూటమి బలంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు బలరామకృష్ణ. వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరినప్పటి నుండి రాజానగరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు బలరామకృష్ణ. మూడేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టుపెంచుకున్నారు. ఇక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజా, ఆయన సోదరుడు గణేశ్‌తో ఢీ అంటే ఢీ అన్నస్థాయిలో తలపడుతుండటం, సవాళ్లు, బహిరంగ విమర్శలతో జోరు చూపిస్తున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.

Also Read: సీఎం జగన్ కీలక నిర్ణయం.. వారి కోసం వైసీపీ మ్యానిఫెస్టోలో కొత్త పథకాలు..!

ప్రభుత్వ పథకాలు, తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వంతో ఎమ్మెల్యే రాజా, టీడీపీ-జనసేన కూటిమి బలం, ప్రజల్లో పలుకుబడితో బలరామకృష్ణ క్షేత్రస్థాయిలో ఎక్కడా తగ్గడం లేదు. నువ్వా-నేనా అన్నట్లు జరిగే సమరంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.