మత సామరస్య కమిటీలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Religious Harmony Committees in AP : ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మత సామరస్యంపై ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందుకుగాను రాష్ట్ర, జిల్లా స్థాయిలో మత సామరస్య కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో 20 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
ఈ కమిటీలో హోం, దేవాదాయ, మైనార్టీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు ఉంటారు. రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. రాష్ట్ర కమిటీలో సభ్యులుగా అన్ని మతాలకు చెందిన ఒక్కో ప్రతినిధి ఉంటారని ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడేందుకు కమిటీలు పని చేయనున్నాయి.
ఈ సందర్భంగా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతుందన్నారు. మత సామరస్యం దెబ్బతినేలా చేస్తున్న పరిస్థితులు ఇబ్బందులు కలిగిస్తున్నాయని అందుకే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ జీఓ నెంబర్ 6 విడుదల చేశామని తెలిపారు. ఈ కమిటీలు మత సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తాయని తెలిపారు. ఈ కమిటీలకు ఎలాంటి కాల పరిమితి లేదన్నారు.
జరిగిన దాడుల వెనుక లోతైన కుట్ర ఉందని అన్నారు. ఇలాంటి వాటిని చేధించాలంటే అధికారులు పోలీసులు, మత పెద్దలు అందరికి బాధ్యత ఉండాలని తెలిపారు. ఈ తరహా నేరాలు జరిగినప్పుడు అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు తప్పించుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని, శాంతిని దెబ్బ తీయాలని చూస్తున్నారు… అందుకే ఈ తరహా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర స్ధాయి కమిటీకి సీఎస్ చైర్మన్‌గా.. డీజీపీ వైస్ చైర్మన్‌గా… అన్ని మతాల నుంచి ఒక్కొక్కరు మెంబర్‌గా… హోం ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ, మైనార్టీ వెల్ ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లా స్ధాయిలో కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపారు.