నిను మరువదు ఈ వాడ…పండువెన్నెల జాడ

YSR Death Anniversary Special: జనం హితం కోరేవాడు జననేత. అలాంటి వాళ్లే మహానేతగా నీరాజనాలు అందుకుంటారు. మంచి పనులతో జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. అలాంటి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జనం గుండెల్లో ఎప్పటికీ చెరగని సంతకం వైఎస్‌ది. వైఎస్సార్ అంటే ఒక ఆత్మీయ పలకరింపు. అంతకుమించి ఓ పెద్ద దిక్కు. అలాంటి మహానేత.. అభిమానులు, పార్టీ కార్యకర్తలను తీరని శోకంలో ముంచుతూ తిరిగిరాని లోకాలకు తరలిపోయి అప్పుడే 11 ఏళ్లు గడిచిపోయాయి. ఆయన వర్ధంతి సందర్భంగా.. మహానేతను తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.
పేదల పెన్నిధి.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను ప్రజలు మరవలేదు. ఆయన పథకాలతో జనం ఇప్పటికీ లబ్ధి పొందుతూ.. నిరంతరం తలుచుకుంటూనే ఉన్నారు. నాడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు.. మహిళలకు పావలా వడ్డీ రుణాలు.. జలయజ్ఞం, రైతులకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఇలా ఎన్నో మంచి పనులతో పేదోళ్ల గుండెల్లో కొలువై ఉన్నారు వైఎస్. నేడు (సెప్టెంబర్ 2) ఆయన వర్ధంతితో ప్రతీ పల్లె.. ప్రతీ గుండె తలుచుకుంటోంది. భౌతికంగా ఆయన లేకపోయినా జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి.
వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు.. ప్రజా సంక్షేమానికి ఎంతో దోహదపడ్డాయి. ప్రజా సంక్షేమమే పరమావధిగా తుది శ్వాస వరకు శ్రమించారాయన. పిల్లలు, యువత, విద్యార్థులు, మహిళలు, వృద్దులు, వికలాంగులు, వితంతువులు, రైతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసి ఆయన దేవుడయ్యారు. ప్రజలకు జలయజ్ఞ ఫలాలు అందించిన మహానేతగా మిగిలిపోయారు. వైఎస్ ముందుచూపు కారణంగా వేలాది ఎకరాల బీడు భూములు పంట పొలాలుగా మారాయి. చాలా ప్రాజెక్ట్‌ల ఫలాల వెనుక వైఎస్ చొరవే కనిపిస్తుంది.
రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా మాత్రమే కాదు.. విద్యుత్ బకాయిలు మాఫీ చేసిన ఘనత కూడా వైఎస్‌కే దక్కుతుంది. ఏడు గంటల పాటు నిరంతరం ఉచిత విద్యుత్ అందించారాయన. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ పథకం తీసుకొచ్చి పేదలకు నీడ కల్పించారు. కార్పొరేట్ ఆస్పత్రుల మెట్లు కూడా ఎక్కని పేదలకు.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంతో ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ అందేలా చూశారు. లక్షలు ఖర్చు చేసే వైద్య సదుపాయాలను పేదలు ఉచితంగా పొందారంటే అది వైఎస్ చలువే.
మహిళల కోసం ఇందిరా క్రాంతి పథకాన్ని తీసుకొచ్చి.. వాళ్లకి పావలా వడ్డీ ద్వారా రుణాలను అందించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించి విద్యాప్రదాతగా నిలిచారు. ఉన్నత చదువులు చదవాలనుకున్న పేద విద్యార్థుల కల సాకారం చేసిన నేతగా వైఎస్ తనదైన ముద్రవేసుకున్నారు.
సకాలంలో వర్షాలు పడక.. ప్రాజెక్ట్‌ల నుంచి నీళ్లు విడుదల కాక.. అహార ఉత్పత్తులు గణనీయంగా తగ్గిన పరిస్థితి. పండిన పంటలను కనీస మద్ధతు ధరకి కూడా రైతులు అమ్ముకోలేక ఆత్మహత్యలు చేసుకునే సిట్యువేషన్. అలాంటి పరిస్థితి నుంచి వారిని ఒడ్డునపడేసిన ఘనత వైఎస్‌దే. నదీ జలాలను కనీసం ఒక పంటకైనా అందించాలన్న పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాన్ని అమలు చేసిన గొప్ప నేత వైఎస్. అందుకే సీఎంగా పగ్గాలు చేపట్టగానే అదే స్ఫూర్తితో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తో పాటుగా జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు.
రైతాంగ సమస్యలపై ఎప్పుడు ఏది చెప్పినా.. సహృదయంతో స్వీకరించేవారు వైఎస్ఆర్. రైతుల కోసం పాటుపడే వారెవరైనా సరే తన సొంత మనుషులుగా ట్రీట్‌చేసే వాళ్లు. మనస్సు విప్పి మాట్లాడేవారు.. సమస్యలు పరిష్కరించేవారు. రైతులకు వైఎస్ కొండంత అండగా ఉండేవారు. పేదోడి కోసం పరితపించిన వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేరు. కానీ తాను ప్రవేశపెట్టిన పథకాల్లో ఎప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు. వినిపిస్తూనే ఉన్నారు. వైఎస్ ప్రతీ అడుగు ప్రతీ పథకం.. ప్రజల జీవితంతోనే ముడిపడి ఉంది. అందుకే వైఎస్ మహానేత.