Sajjala Ramakrishna Reddy: జగన్‌ను అరెస్ట్ చేయడమే టార్గెట్.. ఆ కేసు ఓ కట్టుకథ, నిలబడదు- సజ్జల సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబును అరెస్ట్ చేశారు కనుక జగన్ ను కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నారు.

Sajjala Ramakrishna Reddy: వైసీపీ అధినేత జగన్ ను అరెస్ట్ చేయడమే సీఎం చంద్రబాబు టార్గెట్ అని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. 10టీవీతో మాట్లాడిన సజ్జల.. లిక్కర్ స్కామ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ అనేదే లేదు.. ఇదంతా ఓ కట్టుకథ అని చెప్పారు. ఎవరెవరిని అరెస్ట్ చెయ్యాలో ముందే డిసైడ్ చేసి నడిపిస్తున్నారని చెప్పారు. అసలు లిక్కర్ స్కామ్ కేసులో బేస్ లేదు.. కక్ష సాధింపులకే తప్ప కేసు నిలబడదని అన్నారు. సిట్ పేరుతో రోజుకో స్టోరీ చెబుతున్నారు, చార్జ్ షీట్ లోనూ ఇవే స్టోరీలు చూపించారు అని సజ్జల అన్నారు.
”ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపితే స్కామ్ ఎలా అవుతుంది..? అమ్మకాలు తగ్గితే డిస్టలరీలు ముడుపులు ఎందుకు ఇస్తాయి..? మొన్నటివరకూ రూ.30 వేల కోట్లు అన్నారు.. ఇప్పుడు రూ.3500 కోట్లకి వచ్చారు.. అసలైన లిక్కర్ స్కామ్ 2014-19 మధ్య జరిగింది.. వైసీపీ బలపడుతుందనే కేసులు, స్కామ్ లు అంటూ హడావిడి.. ప్రశ్నించే గొంతును నొక్కెయ్యాలని చూస్తున్నారు. అది అయ్యే పని కాదు.
చంద్రబాబును అరెస్ట్ చేశారు కనుక జగన్ ను కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. అదే వాళ్ల టార్గెట్.. చంద్రబాబు అరెస్ట్ కు ఆధారాలు ఉన్నాయి. స్కామ్ జరిగింది.. ఇక్కడ స్కామ్ లేదు ఆధారాలు లేవు. జగన్ ను అరెస్ట్ చెయ్యాలనే కోరిక వాళ్ళలో ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రిపేర్ అవుతున్నారు అనిపిస్తుంది.
అక్రమంగా జగన్ ను అరెస్ట్ చేసినా మేము ప్రిపేర్ గానే ఉన్నాం. పార్టీ నిర్మాణం గట్టిగా లేనప్పుడే జగన్ ని 16 నెలలు జైల్లో పెట్టారు. ఆనాడే జగన్ చలించలేదు. ఇప్పుడు మా పార్టీ గట్టిగా ఉంది.. జగన్ మరింతగా గట్టిపడతారు. అక్రమంగా అరెస్ట్ చేసినా జగన్ చలించరు.. ప్రశ్నించడంలో వెనక్కి తగ్గరు.. మా నేతల అక్రమ అరెస్టులతో మా క్యాడర్ మరింత యాక్టివ్ అవుతుంది.
అక్రమ అరెస్టులతో మా నేతలు, క్యాడర్ భయపడరు.. ఈ కేసుల వల్ల ప్రజలు కొంత గందరగోళం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆధారాలతో సహా చెబుతున్నాం. హామీలు ఎత్తేస్తాం అని మంత్రులే చెబుతున్నారు. రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుందనడం దుర్మార్గం. ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పుడు తెలియదా ఆర్ధిక పరిస్థితి? మోసం చెయ్యాలనే కదా హామీలు ఇచ్చారు” అని నిప్పులు చెరిగారు సజ్జల రామకృష్ణారెడ్డి.