104 ఆలయాలకు చైర్ పర్సన్ గా సంచయిత గజపతిరాజు…ఏపీ దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం

sanchaitha Gajapati Raju Appoint Chairperson : ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 104 ఆలయాలకు చైర్ పర్సన్ గా సంచయిత గజపతి రాజును నియమించారు. ఈ మేరకు సోమవారం (నవంబర్ 16, 2020) దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కలహాలు ఉండటం, అవి మీడియాకెక్కిన నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత సంచలనం కలిగిస్తోంది.
గతంలో ఆనంద్ గజపతి రాజు ఇలాగే బాధ్యతలు నిర్వహించారు. సంచయిత గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా, సింహాచలం శ్రీవరాహలక్ష్మీస్వామి దేవస్థానం బోర్డు చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే దీంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని 9 దేవాలయాలకు అనువంశిక ధర్మకర్తగా నియమిస్తూ కాకినాడ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటివరకు అక్కడ ట్రస్టీగా కొనసాగుతున్న మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాత్రికి రాత్రి జీవోలిస్తూ హిందూ దేవాలయాల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. ఉన్నపలంగా ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తూ అనర్హులకు కూడా ఇటువంటి నియామకం చేపట్టడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాన్సాస్ ట్రస్ట్ గానీ, దేవాలయాలకు సంబంధించి గానీ ప్రభుత్వం ఇటు మాన్సాస్ వ్యవహారాల్లో తలదూర్చడం, హిందూ దేవాలయాలకు సంబంధించి ఎటువంటి అర్హతలు లేనటువంటి వారికి ఇలాంటి నియామకాలు చేపట్టడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాన్సాస్ ట్రస్ట్ నియామకం నుంచి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవాదాయ శాఖకు సంబంధించి గానీ, దేవాలయానికి గానీ ట్రస్టీగా నియమించిన నేపథ్యంలో అక్కడ ఎవరైతే నెంబర్ గానీ, పూర్తిగా పరిశీలించి, వారి అర్హతలు తెలుసుకున్న తర్వాతే వారిని నియమించాలన్నారు. కానీ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అన్ని మతస్తులను కూడా ఎలాంటి పరిశీలన లేకుండా దేవాలయాలకు ట్రస్టీలుగా గానీ, బోర్టు సభ్యులుగా నియమించడం పట్ల ఆశోక్ గజపతిరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మాన్సాస్ ట్రస్ట్ కు సంబంధించిన వంశీయులు దేవాదాయ పరిధిలో ఉన్నటువంటి 104 దేవాలయాలకు వారు ట్రస్టీలుగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం మాన్సాస్ ట్రస్టీ చైర్మన్ గా కొనసాగుతున్నారో 104 దేవాయాలకు సంబంధించిన తనను కూడా ట్రస్టీగా నియమించాలని సంచయిత గజపతిరాజు దేవాదాయ శాఖకు లేఖ రాసిన పిదప ఈ నియామకం జరిగినట్లు తెలుస్తోంది.