Sanghamitra Express: సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం..
ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల ఈపురుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు విరిగాయి. రైల్వే అధికారులు అప్రమత్తం కావడంతో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది.

Sanghamitra Express
Sanghamitra Express: సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల ఈపురుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు విరిగాయి. రైలు పట్టా విరిగిపోయి ఉండటంతో చేనేత కార్మికుడు గద్దె బాబు అనే వ్యక్తి అటుగా వెళ్తూ గమనించారు. వెంటనే విషయాన్ని రైల్వే అధికారులకు చేరవేశారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు పలు రైళ్లను వేరే ట్రాక్‌పైకి మళ్లించారు. అదే ట్రాక్‌పై దానాపూర్ నుంచి బెంగళూరు సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ రైలు వెళ్తోంది. రైల్వే అధికారులు పట్టాలు విరిగాయని ముందస్తు సమాచారం ఇవ్వడంతో రైలును నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
సంఘటన స్థలంకు చేరుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్ మరమ్మతు చర్యలు చేపట్టారు. మరమ్మతులు పూర్తిచేసిన అనంతరం సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలు బెంగళూరు బయలుదేరి వెళ్లనుంది. మరికొన్ని రైళ్లను వేరే ట్రాక్‌పైకి మళ్లించారు. రైల్వే అధికారుల అప్రమత్తతో ప్రమాదం తప్పడంతో రైలులో ప్రయాణికులు విషయం తెలుసుకొని ఊపిరిపీల్చుకున్నారు.