సంక్రాంతి సందడి : భీమవరం కోడిపుంజులంటే యమ క్రేజ్

సంక్రాంతి సందడి షురువైంది. గోదావరి జిల్లాల్లో కోడిపందాల జోరు హోరెత్తిస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతికి కోడిపుంజులు రెడీ అవుతున్నాయి. సాధారణంగా ఆరునెలల ముందునుంచే కోడిపుంజులను రెడీ చేస్తుంటారు. వీటికి కఠినమయిన శిక్షణ ఇస్తారు. బరిలో నిలవాలంటే కోడి బలిష్టంగా ఉండాలి. అందుకు తగ్గట్టే పందెంకోళ్లకు జీడిపప్పు, బాదంపిస్తాతో ఆహారం అందిస్తున్నారు. కాస్ట్‌లీ అయినా లెక్కచేయకుండా మినరల్ వాటర్ తాగిస్తున్నారు.
భీమవరం కోడిపుంజులు : –
భీమవరం కోడిపుంజులంటే యమ క్రేజ్. రాష్ట్రమంతటా వీటికి మంచి గుర్తింపు ఉంది. ఈ పుంజులను కొనేందుకు చాలామంది పోటి పడతారు. సంక్రాంతి మరో వారం రోజులు కూడా లేకపోవడంతో పోటీదారులు కోడిపుంజుల కొనుగోలుకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ నుంచి కూడా రాజకీయ, వ్యాపార ప్రముఖులు పుంజులను కొనుగోలు చేయడానికి తరలివస్తున్నారు.
ప్రత్యేక శ్రద్ధతో పెంపకం : –
పందాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్వాహకులు కోడిపుంజుల శిబిరాల దగ్గర జీతగాళ్లను పెట్టి మరీ వాటిని పెంచుతున్నారు నిర్వాహకులు. కోడిపందేల కోసం తయారుచేసే కోడిపుంజులకు నెలకు ఏడెనిమిది వేల వరకూ ఖర్చవుతుంది. మూడునెలల పాటు ఈ పెంపకం ఉంటుంది. దీంతో కోడిపుంజు ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది. పందెంరాయుళ్లు ముందుగా వచ్చి వారికి కావాల్సిన రకం బట్టి కొంత అడ్వాన్సు ఇచ్చి వెళుతుంటారు. అందుకే సంక్రాంతి ముందు వరకూ వీటిని ప్రత్యేక శ్రద్ధతో పెంపకందారులు పెంచుతారు.
పందెం రాయుళ్లపై ఉక్కుపాదం : –
ఇదిలా ఉంటే…పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పందెం రాయుళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పందెం రాయుళ్లు ఏర్పాటు చేసిన కోడిపందాల బరిలు జేసీపీతో ధ్వంసం చేశారు. పోలీసులు కోడి పందాలు నిర్వహించే 70 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని చెప్పారు. సంక్రాంతికి కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read More : – కవాతు నిర్వహించాలా ? వద్దా ? : నేతలతో పవన్ కళ్యాణ్ భేటీలు