కొత్త అల్లుళ్లు..సరదాల సంక్రాంతి

సంక్రాంతి..పండుగ సందర్భంగా తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో అలంకరించారు. మామిడి తోరణాలు, కొత్త అల్లుళ్ల సందడి, బావా మరదల్ల సరసరాలు, బంధువులతో సందడి సందడిగా మారిపోయింది. ఏపీలో కోళ్ల పందాలు, ఎద్దుల బల ప్రదర్శన, ఇతర ఆటలతో కోలాహాలంగా మారింది. పుష్యమాసం, హేమంత ఋతువు, మంచు కురిసే సమయంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చది మకర సంక్రాంతి. దేశ వ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పేర్లతో నాలుగు రోజులు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.
తెలుగు వారి అచ్చతెలుగు పల్లె పండుగ. బసవన్నచిందులు, హరిదాసుల సంకీర్తనలు, గాలిపటాలు, బావా మరదళ్ల సరసాలు..ఇలా సంక్రాంతి సరదాలు ఎన్నో. ప్రధానంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారు. సంక్రాంతికి ఇంటికి కొత్త అల్లుడు వస్తున్నాడంటే..ఆ హడావుడి వేరు. మరదళ్ల సరసాలు, బావ మరదుల వేళకోళాలు..అవి కావాలని..ఇవి కావాలని అడిగే..అల్లుడు..తర్వాత ఇస్తామంటూ..మామ..ఆ సందడి వేరు. కొత్తగా వివాహమైన ఆడ పడుచులు, అల్లుళ్లను సంక్రాంతికి ఇంటికి ఆహ్వానిస్తుంటారు.
పండుగకు వచ్చే వారికి కొత్త దుస్తులు, వంటలతో వారికి సకల ఏర్పాట్లు చేయడంలో బిజీ బిజీగా ఉంటున్నారు. వంటకాల తయారీలో ఆడవారు నిమగ్నమౌతుంటే..వీరికి మగవారు తోచిన విధంగా సహాయం చేస్తుంటారు. కొత్త అల్లుళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తుంటారు. ఇక పిండి వంటలు సంగతి చెప్పనవసరం లేదు. ఏ ఇంట్లో చూసిన ఘుమఘుమలు వస్తుంటాయి.
సంబరాల్లో వంటల ప్రత్యేకత ఉంటుంది. భోగి రోజు దోసెలు, గారెలు చేస్తారు. మకరం రోజు పెద్దలను పూజిస్తారు. ప్రసాదాలు పంచి పెడుతారు. వాటి సువాసననే కడుపు నిండిపోతుంది. సున్నుండలు, అరిశెలు, జంతికలు, పూత రేకులు, పాకుండాలు, బొబ్బట్లు, గారెలు..ఇలా ఒకటి కాదు..రెండు కాదు..ఎవరికిష్టమైన పిండి వంటలు వారు వండుకుంటుంటారు. వీటిని ఇరుగుపొరుగు వారికి పంచిపెడుతుంటారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా గాలి పటాలు ఎగరేస్తుంటారు. వీటిని ఎగిరేయడానికి పెద్దలు కూడా ఆసక్తి చూపుతంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే..చిన్న పిల్లల్లా మారిపోతుంటారు. ఇక ఏపీలో కోళ్ల పందాలు జోరు కనిపిస్తుంది. తన పుంజు గెలుస్తుందని ఒకరు..తన పుంజు గెలుస్తుందని మరొకరు..ఇలా బెట్టింగ్‌లు వేసుకుంటూ బరుల వద్ద కోళ్ల పందాలు నిర్వహిస్తారు. కోట్లలో ఈ బెట్టింగ్ జరుగుతుంటుంది. గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి ముందుగానే కోడి పందాలు మొదలవుతాయి. వీటిపై నిషేధం ఉన్నప్పటికీ ఏటా జరుగుతూనే ఉన్నాయి.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా సరదాగా కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు చెప్తున్నప్పటికీ… చాలాచోట్ల వేలు, లక్షల్లో పందాలు కాస్తున్నారు. కోడి పందాలు జరిగే చోట పందెం రాయుళ్లతో పాటు పైపందాలు కాసేవారు ఎక్కువగా ఉంటారు. దీంతో పందెం మొత్తం రోజురోజుకీ పెరుగుతోంది. కనుమ రోజు వ్యవసాయంలో రైతులకు చేదోడువాదోడుగా నిలిచే ఆవులను ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. చికెన్, మటన్ మాంసాహారాలు చేస్తుంటారు. అలసంద వడలతో కూడిన భోజనాలను ఆరగిస్తారు.
కానీ వంటకాలు చేసేందుకు అవసరమైన సరుకుల ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో నూనె రూ. 100 ఉండగా, ఉల్లి, వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పట్టణాల్లో కొందరు దుకాణ దారులు పండుగ సందర్భంగా అమాంతం రేట్లు పెంచేశారు. సంక్రాంతి పండుగకు ఎక్కడున్నా..వారి వారి స్వగ్రామాలకు వెళుతుంటారు. వీరి రాకతో పల్లెలు మరింత శోభతో వెలిగిపోతాయి. ఏడాదికి సరిపడా ఆనందాన్ని తీసుకెళుతారు..అందుకే..అంటారు..సంక్రాంతి ఆనందాల, సరద క్రాంతి అంటారు.
Read More : కేజ్రీని అట్రాక్ట్ చేసిన వీడియో..అతని కలవాలని ఉంది