Anakapalli School Wall Collapsed : అనకాపల్లి జిల్లాలో కుప్పకూలిన స్కూల్ గోడ.. తప్పిన ప్రమాదం

కలవలాపల్లిలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల పునరుద్దరణ పనులు చేశారు. స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. అయితే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రహరీ గోడ కూలిపోయింది.

Anakapalli School Wall Collapsed : అనకాపల్లి జిల్లాలో కుప్పకూలిన స్కూల్ గోడ.. తప్పిన ప్రమాదం

Updated On : September 14, 2022 / 5:02 PM IST

Anakapalli School Wall Collapsed : అనకాపల్లి జిల్లా కలవలాపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రజాధనాన్ని వృథా చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలవలాపల్లిలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల పునరుద్దరణ పనులు చేశారు. స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు.

అయితే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రహరీ గోడ కూలిపోయింది. ఏడాది కూడా గడవక ముందే స్కూల్ గోడ కూలిపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, స్కూల్ ప్రహరీ గోడ కూలిన సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఒకవేళ పిల్లలు ఉన్న సమయంలో గోడ కూలి ఉంటే.. చాలా ఘోరం జరిగిపోయేదని అంటున్నారు.

ఆధునిక సౌకర్యాల నడుమ పిల్లలు చదువుకోవాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం మనబడి నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ధనవంతుల పిల్లలతో సమానంగా పేదల పిల్లలు కూడా ఆధునిక సౌకర్యాల నడుమ తరగతి గదుల్లో విద్యనభ్యసించాలనే ఆశయంతో సీఎం జగన్‌ ఈ పథకానికి రూపకల్పన చేశారు. నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు జగన్ సర్కార్ అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.

ఇలాంటి తరుణంలో స్కూల్ ప్రహరీ గోడ కుప్పకూలడం సర్కార్ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా ఉంది. ఆధునిక సౌకర్యాలు, మరమ్మతుల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రతిపక్షాలు శంకిస్తున్నాయి. తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు అప్పగించి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నాణ్యత లేని పనులతో విద్యార్థుల జీవితాలో చెలగాటం ఆడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.