Andhra Pradesh : చిత్తూరు జిల్లాలో నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు..సబ్ సబ్‌రిజిస్ట్రారుతో సహా 11మంది కేసు నమోదు,ఏడుగురు అరెస్ట్

Registrations with duplicate documents In AP
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో నకిలీ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు కలకలం రేపాయి. తన స్థలాన్ని అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేయగా నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా తేలింది. దీంతో పోలీసులు ప్రస్తుతం కుప్పం సబ్ రిజిస్ట్రార్ గా ఉన్న వెంకటసుబ్బయ్యతో పాటు 11మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ముమ్మం చేయగా ఈకేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. ఈ అరెస్టులపై సీఐ గంగిరెడ్డి మాట్లాడుతూ..భూ సంబంధిత నేరాలకు పాల్పడిన బండారు అంజమ్మ, బండారు శంకరప్ప, ఓ.శంకరప్ప, కృపాకర్, నరసింహులు, డాక్యుమెంట్ రైటర్లు మాస్తాన్‌సాహెబ్, మునిరాజాచారిని అరెస్టు చేశామని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మదనపల్లె మండలం పప్పిరెడ్డిపల్లెకు చెందిన శివకుమారి అనే మహిళ సెప్టెంబరులో ఎస్పీ రిషాంత్‌రెడ్డిని కలిసి పుంగనూరులో తనకు వాటాగా వచ్చిన స్థలాన్ని తనకు తెలియకుండా తన కుటుంబ సభ్యులు, మరికొందరు కలిసి అమ్మేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేశారు పోలీసులు. పట్టణంలోని తాటిమాకులపాళ్యంనకు చెందిన బి.వెంకట్రాయప్ప, అంజమ్మ దంపతులకు శంకరప్ప, సుబ్రమణ్యం, నాగరాజులతో పాటు శివకుమారి అనే కూతురు కూడా ఉంది. అంజమ్మకు తన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన 98 సెంట్ల భూమిని కొడుకులు, కుమార్తెకు విడి విడిగా దానవిక్రయం చేసినట్లుగా రిజిస్టర్ చేసి ఇచ్చారు.
ఆ తర్వాత ఈ స్థలంపై జరిగిన క్రయ విక్రయాల్లో గందరగోళం జరిగింది. దీంట్లో తన స్థలం లేకపోవడంతో శివకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చేపట్టిన దర్యాప్తులో శివకుమారి స్థలానికి సంబంధించి సరిహద్దులు, సేల్‌డీడ్‌లు చేసుకున్నట్లు తేలింది. ఈ కేసులో అప్పటి సబ్‌రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్యతో పాటు 11మందిపై కేసు నమోదుచేసిన పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశారు. మిగిలినవారికోసం గాలిస్తున్నారు.