మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని నరికిన కొడుకు

మద్యం తాగటానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని నరికి చంపిన కర్కోటకుడైన కొడుకు ఉదంతం తెనాలిలో వెలుగు చూసింది. గుంటూరు జిల్లా తెనాలి, గంగానమ్మపేటలో ఉండే శశీదేవి(65) భర్త మరణానంతరం కుమారుడు లక్ష్మినారాయణ కుటుంబంతో కలిసి ఉంటోంది. ఆమె తొపుడు బండిపై ప్లాస్టిక్ సామాన్లు విక్రయించుకుంటూ ఉండగా, కొడుకు పనసకాయల వ్యాపారం చేసేవాడు.
మద్యానికి బానిసైన లక్ష్మినారాయణ ఇంటి గురించి పట్టించుకోక పోవటంతో తాను ప్లాస్టిక్ సామాన్లు అమ్మగా వచ్చిన డబ్బులతో అతడి కుటుంబ ఆలనాపాలనా చూస్తోంది. శుక్రవారం లక్ష్మినారాయణ వ్యాపారానికి వెళ్లలేదు. ఈక్రమంలో రాత్రి అయ్యేసరికి మద్యం కోసం తల్లిని డబ్బులు కావాలని అడిగాడు. కొడుకు వ్యసనాలు తెలిసిన తల్లి ..తన దగ్గర డబ్బుల్లేవని చెప్పింది.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న లక్ష్మినారాయణ ఉన్మాదంతో అక్కడే ఉన్న పనసకాయలు కోసే కత్తితో తల్లి మెడపై వేటు వేసి పారిపోయాడు. గాయంతీవ్రత అర్ధంకాని శశీదేవి “నాపీక కోసేశాడు” అని అరుచుకుంటూ టూటౌన్ పోలీసు స్టేషన్ కు పరిగెట్టింది. ఆమె వెంట కోడలు కూడా పోలీసుస్టేషన్ కుచేరింది. గాయం తీవ్రత గమనించిన పోలీసులు వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా ఆమె కన్ను మూసింది.