Ayyanna Patrudu: వైసీపీ నేతల రప్పారప్పా డైలాగులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక కామెంట్స్.. జగన్‌కు సూటి ప్రశ్న..
Ayyanna Patrudu: వైసీపీ నేతలు రప్పారప్పా డైలాగులపై, వైఎస్ జగన్ వ్యాఖ్యలపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక కామెంట్స్ చేశారు.

Speaker Ayyanna Patrudu
Ayyanna Patrudu: వైసీపీ నేతలు రప్పారప్పా డైలాగులపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) కీలక కామెంట్స్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం శాంతిభద్రతలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ప్రెస్‌మీట్లు, సోషల్ మీడియాలో బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. మళ్లీ మేమే వస్తాం మీ అంతుచూస్తాం, పీకలు కోస్తాం.. రప్పారప్పా అంటూ సినిమా డైలాగులు కొడుతున్నారు. ఎన్టీఆర్ హయాంలో నుంచి రాజకీయాల్లో ఉన్న.. మేం ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని అన్నారు. మేము కూడా ఓడిపోలేదా.. ఓడిపోతే రప్పారప్పానా.. మీలా మాట్లాడలేను ఆవేశం వస్తుంది. అయితే కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది అంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు వస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నవారు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. సభకు వచ్చి ప్రజలకోసం మాట్లాడాలి. సభకు రానప్పుడు ప్రశ్నలు వేయడం ఎందుకు..? అంటూ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ స్పీకర్ వ్యాఖ్యానించారు. సభకురారు, ఎమ్మెల్యేలను రానివ్వరు, క్వశ్చన్‌లు మాత్రం పంపుతున్నారు. ప్రజలు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు.
గతంలో గౌతు లచ్చన్న వంటి గొప్పవారు ఈ సభలో ఉన్నారు. ఆయన పార్టీ తరపున 64 మంది గెలిస్తే ప్రతిపక్ష హోదాను ఇచ్చారు. వేర్వేరు కారణాలతో ఆయన పార్టీ నుంచి కొందరు వెళ్లిపోయారు. అప్పుడు గౌతు లచ్చన్న ప్రతిపక్ష హోదా వదులుకున్నారు. కానీ, ఇప్పుడు నెంబర్ లేకుండా నాకెందుకు ఇవ్వరు అంటున్నారు.
ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని నాపై కోర్టుకు వెళ్లారు. అసెంబ్లీ దేవాలయం, నేను పూజారిని. ఇక్కడ నిర్ణయాలు నా అనుమతి మేరకే జరుగుతాయని అయ్యన్న పాత్రుడు అన్నారు.