Terrorists Arrest: అన్నమయ్య జిల్లాలో టెర్రరిస్టుల కలకలం.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. 30 ఏళ్ల తర్వాత ఇలా చిక్కారు..
అరెస్ట్ చేసిన ఇద్దరినీ చెన్నైలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు.

Terrorists Arrest: అన్నమయ్య జిల్లాలో టెర్రరిస్టుల కలకలం రేగింది. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. రహస్య ఆపరేషన్ అమలు చేసి ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ATS). వారిని చెన్నైకు తీసుకెళ్లింది. అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ లను అదుపులోకి తీసుకుంది ఏటీఎస్. వీరిద్దరు అనేక ఉగ్ర కేసుల్లో ఉన్నారు. 30 ఏళ్ళుగా పరారీలో ఉన్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరినీ చెన్నైలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు.
* అబూబక్కర్ సిద్దికీ 1995 నుండి పరారీలో ఉన్నాడు.
* 1995: చెన్నై చింతాద్రిపేటలో హిందూ మున్నాని కార్యాలయంలో బాంబు పేలుడు.
* 1995: నాగూరులో పార్శిల్ బాంబు పేలుడు.
* 1999: చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, కేరళలో 7 చోట్ల బాంబు ఉంచడం (చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా).
* 2011: మధురైలో అద్వానీ రథయాత్ర సమయంలో పైప్ బాంబు.
* 2012: వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య.
* 2013: బెంగళూరు మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు కేసుల్లో నిందితుడు.
* 26 ఏళ్లుగా పరారీలో ఉన్న మొహమ్మద్ అలీ
* 1999లో తమిళనాడు, కేరళలో బాంబు పేలుళ్ల ఘటనలో ఇతను నిందితుడు.
వీరిద్దరికి పలు బాంబు పేలుళ్లు, మతపరమైన హత్యలలో ప్రమేయం ఉన్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. 30 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. కేంద్ర నిఘా సంస్థల నుండి వచ్చిన సమాచారం, సాయంతో ఏటీఎస్ వారిని పట్టుకోగలిగింది. చాలా కాలంగా వీరి కోసం ఏటీఎస్ ట్రాక్ చేస్తోంది. చివరికి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా ఉన్నట్లు తెలిసింది. వీరి ఇద్దరి తలలపై 5 లక్షల రూపాయల నగదు బహుమతి ఉంది.
1995 నుండి పరారీలో ఉన్న ముస్లిం యాత్రికుల పట్టణం నాగూర్‌కు చెందిన అబూబకర్, చెన్నైలోని చింతాద్రిపేటలోని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ అయిన హిందూ మున్నాని (హిందూ ఫ్రంట్) కార్యాలయంలో 1995లో జరిగిన బాంబు పేలుడుతో సహా అనేక హై-ప్రొఫైల్ ఉగ్రవాద కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
నాగోర్‌లో హిందూ మితవాద కార్యకర్త టి ముత్తుకృష్ణన్ మృతి చెందిన పార్శిల్ బాంబు పేలుడు, 1999లో ఎగ్మోర్‌లోని చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం, తిరుచ్చి, కోయంబత్తూరుతో సహా మరో ఆరు ప్రదేశాలలో బాంబులు అమర్చడం, కేరళలో ఒక కేసు, బిజెపి ప్రముఖుడు ఎల్ కె అద్వానీ రథయాత్ర సందర్భంగా మధురైలో 2011లో పైప్-బాంబు ప్రయత్నం, 2012లో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య, 2013లో బెంగళూరులోని మల్లేశ్వరంలోని బిజెపి కార్యాలయం సమీపంలో జరిగిన బాంబు పేలుడు వంటి కేసులు అతనిపై ఉన్నాయి.
అబూబకర్ సహచరుడు తిరునెల్వేలిలోని మేలపాళయంకు చెందిన మహ్మద్ అలీ 26 సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడు. 1999లో తమిళనాడు, కేరళలో జరిగిన బహుళ బాంబు దాడుల కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని మరిన్ని ఉగ్రవాద సంబంధాలను వెలికితీసే ప్రయత్నంలో దర్యాఫ్తు అధికారులు ఉన్నారు.