తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరాచకం : చంద్రబాబు

తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరాచకం  : చంద్రబాబు

Updated On : January 5, 2021 / 3:53 PM IST

TDP chief Chandrababu fires on YCP government policies : వైసీపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనలపై చంద్రబాబు స్పందించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జేసీ సోదురులపై.. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచితంగా ప్రవర్తించడాన్ని తప్పుపట్టారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసంలోకి పెద్దారెడ్డి ప్రవేశించి అరాచకం సృష్టించారని మండిపడ్డారు. జేసీ సోదరుల నివాసంలోకి ఎమ్మెల్యే వెళతారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెళితే పోలీసులు తలుపులు తీస్తారా అని నిలదీశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి తాడిపత్రి ఘటనలే నిద్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరుల దాడులు ప్రతి దాడులు.. అరెస్టులతో కొద్దిరోజుల కిందట తాడిపత్రి అట్టుడికింది. ఇంకా అక్కడ సాధారణ పరిస్థితి రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఈ గొడవల్లో ఇరువర్గాలకు చెందిన నిందితులను పోలీసులు అరెస్టు చేసినా.. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది. తాజాగా జేసీ కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతో తీవ్రంగా స్పందించిన జేసీ దివాకర్‌రెడ్డి.. తన సోదరుడు ప్రభాకర్‌రెడ్డితో కలిసి నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.

తనపై పెట్టిన అట్రాసిటీ కేసును ఉపసంహరించుకునే వరకు ఆమరణ దీక్ష చేస్తానని జేసీ దివాకర్‌ రెడ్డి ప్రకటించడంతో తాడిపత్రిలో హైటెన్షన్‌ నెలకొంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ అనుచరుల ఘర్షణ తర్వాత పట్టణంలో 144 సెక్షన్‌ అమలులో ఉన్నా దీక్ష చేసి తీరుతానని ప్రతిజ్ఞ చేయడంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొవిడ్‌ నిబంధనలు, పోలీసు చట్టం వంటి.. ఎన్ని నిబంధనలు అమల్లో ఉన్నా.. దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.