Chandrababu Naidu: దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా..! మరోసారి ట్విటర్ వేదికగా జగన్‌కు చంద్రబాబు సవాల్

నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 50 రోజులే ఉంది. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ను విసిరిపారేయడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

Chandrababu Naidu: దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా..! మరోసారి ట్విటర్ వేదికగా జగన్‌కు చంద్రబాబు సవాల్

Chandrababu Naidu

Chandrababu Open Challenge : వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ బహిరంగ సభల్లో ప్రజలకు ఇచ్చిన హామీల వీడియోను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసిన చంద్రబాబు.. చర్చకు సిద్ధమా జగన్ రెడ్డీ అంటూ ప్రశ్నించారు. సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి.. విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి.. ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ? అంటూ చంద్రబాబు నిలదీశారు.

Also Read : ఏ క్షణమైనా ఢిల్లీకి చంద్రబాబు.. ఏపీలో పొత్తులపై తేల్చేయనున్న బీజేపీ అధిష్టానం

నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 50 రోజులే ఉంది. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ను విసిరిపారేయడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుందంటూ చంద్రబాబు హెచ్చరించారు. బూటకపు ప్రసంగాలు కాదు.. అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా జగన్ రెడ్డీ అంటూ చంద్రబాబు సవాల్ చేశారు. ప్లేస్, టైం నువ్వు చెప్పు. ఎక్కడికైనా వస్తా. దేనిమీదైనా చర్చిస్తా.. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ అంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేశారు.

Also Read : YS Jagan : అందరూ చొక్కాలు మడతేసి, ఆ కుర్చీ మడతపెట్టి..: సీఎం జగన్

రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాక్యలు చేశారు. రంగు రంగుల మ్యానిఫెస్టో పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు వస్తున్నారు.. చంద్రబాబు నాయుడి పేరు చెబితే ఎవరికైనా సామాజిక న్యాయం గుర్తుకువస్తుందా? అని జగన్ అడిగారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ పథకాల వల్ల ఇప్పుడు ఇంగ్లిష్ లో మాట్లాడుతున్నారని చెప్పారు. తాము అధికారంలోకి రాకపోతే మళ్లీ మంచి పథకాలన్నీ అందకుండా పోతాయని జగన్ అన్నారు. 2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతుందని తెలిపారు. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందని జగన్ అన్నారు. జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ బూటకపు ప్రసంగాలు కాదు.. అభివృద్ధి పాలన ఎవరిదో.. విధ్వంసం పాలన ఎవరిదో జనం ముందే చర్చిద్దాం అంటూ ఆదివారం చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. తాజాగా మరోసారి జగన్ కు ట్విటర్ వేదికగా చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఈసారి జగన్ గత ఎన్నికల సమస్యలో ప్రజలకు ఇచ్చిన హామీల వీడియోను చంద్రబాబు ట్విటర్ లో షేర్ చేశారు. అయితే, చంద్రబాబు సవాల్ పై జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారన్న అంశం ప్రస్తుతం ఏపీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.