ఏడాదిన్నరగా వేమిరెడ్డి దంపతులపై వైసీపీ టార్గెట్…కానీ పబ్లిక్ సింపతీ మాత్రం టీడీపీకేనా?
సందర్భం దొరికిన ప్రతీసారి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు వైసీపీ నేతలు.
Vemireddy Prabhakar Reddy and Prashantireddy
ఆయన పక్కా బిజినెస్‌మెన్. వ్యాపారం చేస్తూనే కోట్ల రూపాయలు ప్రజా సేవ కోసం ఖర్చు పెట్టిన ఆయన..రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేసేందుకు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గత ఎన్నికల వరకు వైసీపీలో ఉన్నారు. ఆ తర్వాత టీడీపీలో చేరి మళ్లీ ఎంపీ అయ్యారు. అప్పటి నుంచి ఫ్యాన్ పార్టీకి ఆయనే టార్గెట్ అయిపోయారట. సింహపురి వైసీపీ నేతలే కాదు..మాజీ సీఎం జగన్ కూడా ఆయన్నే టార్గెట్ చేస్తుండటం చర్చకు దారితీస్తోంది. వేమిరెడ్డే ఎందుకు టార్గెట్ అయినట్లు.? చిన్న మాటకు కూడా హర్ట్ అయ్యే వేమిరెడ్డి..జగన్‌కే కౌంటర్ ఇవ్వడానికి రీజనేంటి.?
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నాన్ కాంట్రవర్సీ లీడర్. మంచి బిజినెస్ మెన్ కూడా. 2018 వరకు పాలిటిక్స్‌తో సంబంధం లేని వ్యాపారవేత్తగా ఉన్న ఆయన..అందరి వాడిగా ఉంటూ వచ్చారు. 2019లో పొలిటికల్ అరంగేట్రం చేసి వైసీపీ నుంచి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత జగన్‌తో విబేధించి టీడీపీ గూటికి చేరి 2024లోనూ ఎంపీగా గెలిచారు. ఎప్పుడైతే ఫ్యాన్ స్విచ్చాఫ్ చేసి..సైకిల్ ఎక్కారో అప్పటినుంచి వేమిరెడ్డి..వైసీపీకి తెగ టార్గెట్ అయిపోయారట. ఒకప్పుడు వైసీపీలో ఆయనకు సన్నిహితులుగా ఉన్న నేతలంతా ఇప్పుడు ప్రత్యర్థులు అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఆర్థికంగా బలవంతుడగా..మంచి పేరున్న లీడర్‌గా ఉన్న వేమిరెడ్డి..సైకిల్ ఎక్కడం తమకు పెద్ద మైనస్ అయిందని వైసీపీ రగిలిపోతోందట. అందుకే నెల్లూరు జిల్లా ఫ్యాన్ పార్టీ లీడర్లే కాదు..వైసీపీ అధినేత జగన్ కూడా ఆయన్నే టార్గెట్ చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో అంగబలం, అర్ధబలం రెండూ జతకలసి టీడీపీకి అంది వచ్చిన అస్త్రంగా మారడం వల్లే..వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీకి టార్గెట్ అయ్యారన్న చర్చ జరుగుతోంది.
ఆ మధ్య వేమిరెడ్డి రూ.400 కోట్లతో క్వార్ట్జ్ ఫ్యాక్టరీ పెట్టి..వెయ్యి మందికి ఉపాధి కల్పించాలని అనుకున్నారు. వైసీపీ నేతలు ఆ క్వార్ట్జ్ ఫ్యాక్టరీ అనుమతులు, వ్యాపారంపై ఓ రేంజ్‌లో విమర్శలు, ఆరోపణలు చేశారు. దీంతో మంచి చేద్దామని..సొంత డబ్బుతో సేవ చేద్దామని ముందుకొస్తే తనపైనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని హర్ట్ అయిపోయారాయన. తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదంటూ..క్వార్ట్జ్ ఫ్యాక్టరీ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. మాటలు పడలేకే క్వార్ట్జ్ బిజినెస్‌ను ఆపేస్తున్నట్లు అప్పట్లోనే ప్రకటించేశారు. ఆ ఇష్యూ తర్వాత సమయం, సందర్భం దొరికిన ప్రతీసారి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు వైసీపీ నేతలు. ఆ మధ్య వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి..వేమిరెడ్డి సతీమణి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఏకంగా ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది. ఆయనపై ప్రశాంతిరెడ్డి కేసు కూడా పెట్టారు. ప్రసన్నకుమార్ రెడ్డి..ప్రశాంతిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. వారం రోజుల పాటు అప్పట్లో ఆ ఇష్యూ వేమిరెడ్డి దంపతుల చుట్టే తిరిగింది. తర్వాత వైసీపీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా తిరుమల కల్తీ నెయ్యి కేసులో..వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న అరెస్ట్ వ్యవహారం..నెమ్మదిగా వేమిరెడ్డి వైపు మళ్లించే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తోంది టీడీపీ. తిరుమల లడ్డూ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసుల అదుపులో ఉన్న చిన్న అప్పన్న..ఎంపీ వేమిరెడ్డి పీఏ అంటూ జగన్ చేసిన విమర్శలు చర్చకు దారి తీశాయి. దీంతో వేమిరెడ్డే డైరెక్టుగా మీడియా ముందుకు వచ్చి..వైసీపీ అధినేతకు బిగ్ సవాల్ చేశారు. ఫస్ట్ టైమ్ జగన్ మీద డైరెక్ట్ అటాక్ చేసిన వేమిరెడ్డి..తన మనసు రగిలిపోతోందని..అందుకే..జగన్‌పై కామెంట్లు చేయాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. చిన్న అప్పన్నకు తాను డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమేనని వేమిరెడ్డి.. అప్పన్న కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే సాయం చేశానన్నారు. సేవాభావంతోనే అప్పన్న కుటుంబానికి రూ.50 వేలు ఇచ్చినట్లు చెప్పారు. తానేదో తప్పు చేసినట్టు జగన్ మాట్లాడారని మండిపడ్డ వేమిరెడ్డి..తనపై చేసిన ఆరోపణలపై దేవుడి ముందు ప్రమాణం చేయాలంటూ సవాల్ చేశారు.
వైసీపీని వీడినప్పటి నుంచి వేమిరెడ్డి దంపతులు ఇద్దరూ రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా..నిలదొక్కుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇటు తమ నియోజకవర్గాల్లోనూ..అటు ప్రజల్లోనూ వారి గ్రాఫ్ పెరుగుతోందే తప్ప..ఎక్కడా మైనస్ కావడం లేదంటూ ప్రత్యర్థులు అసూయ పడుతున్నారట. స్వయంగా చేస్తున్న సాయాలు కొన్నయితే..రాజకీయ నాయకులుగా పనులు కూడా వారి ఇమేజ్‌ను అంతకంతకు పెంచుతున్నాయట. అంతేకాదు..ప్రత్యర్థులు చేస్తున్న పాలిటిక్స్ కూడా వారికే రివర్స్ అవుతున్నాయని అంటున్నారు. అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్స్ అయినా..ఇప్పుడు జగన్ ఆరోపణలు అయినా..క్వార్ట్జ్ ఫ్యాక్టరీ విషయంలో అయినా.. వేమిరెడ్డికే ప్లస్ పాయింట్ అయింది తప్ప..ఆయన ఇమేజ్‌కు వచ్చిన ఇబ్బందేమి లేదని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఇలా ఇష్యూ ఏదైనా ఏడాదిన్నర కాలంలో వేమిరెడ్డి వైసీపీకి టార్గెట్ అవడం అయితే పొలిటికల్ హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
