ఏపీలో మరో ఎన్నికల యుద్ధానికి కూటమి సిద్ధం.. వైసీపీ సంగతేంటి?
ఆయన కోరుకుంటున్నట్లు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరగబోతున్నాయ్.

Chandrababu-Jagan
ఏపీలో మరో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. మళ్లీ రాజకీయం హీటెక్కబోతోంది. కూటమి అభ్యర్థులు ఫిక్స్ అయ్యారు.. మరి వైసీపీ సంగతేంటి.. ఫ్యాన్ పార్టీ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేస్తోంది. వార్ వన్‌సైడ్ అన్నట్లు కనిపించాల్సిన ఈ ఎలక్షన్స్.. అధికార, ప్రతిపక్షాలకు సవాల్‌గా మారాయా.. ఎవరి ముందు ఎలాంటి సవాళ్లు ఉన్నాయ్.. ఎన్నికల యుద్ధంలో పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్..
మరో ఎన్నికల యుద్ధానికి ఏపీ సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అద్భుత విజయంతో కూటమి అధికారంలోకి రాగా.. వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. రాష్ట్రంలో అధికారం మారింది.. రాజకీయం కూడా మారింది. త్వరలో జరుగబోయే రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు… నిరాశలో ఉన్న వైసీపీకి, జనాలు తమవైపే
ఉన్నారంటున్న టీడీపీకి అగ్నిపరీక్షగా మారబోతుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయాలకు కేంద్రంగా.. అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలో పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయ్. దీంతో ఈ సమరం మరింత ఆసక్తికరంగా మారింది.
పేర్లను ఖరారు చేసిన టీడీపీ
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్… ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పేర్లను టీడీపీ ఖరారు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలకు.. టీడీపీ అవకాశం ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు కేబినెట్‌లో ఆలపాటి.. విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తెనాలి టికెట్ ఆశించగా.. పొత్తులో భాగంగా అది జనసేనకు కేటాయించాల్సి వచ్చింది. దీంతో ఐ.పోలవరం ఎంపీపీగా, జెడ్పీటీసీగా పనిచేసిన రాజశేఖర్.. పార్టీ అధినేత చంద్రబాబు ప్రోగ్రామ్ కమిటీలో సభ్యుడిగా కూడా వ్యవహరించారు. గత ఎన్నికల్లో కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు
రాజశేఖర్ ప్రయత్నం చేసినా పొత్తుల్లో సీటు దక్కలేదు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరికి చాన్స్ దక్కింది. అటు వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని, అందివచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకునేందుకు పావులు కదుపుతోంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా పొన్నూరు గౌతంరెడ్డి పేరు ప్రకటించింది.
రెండు స్థానాలకు టీడీపీ తరఫున అభ్యర్థులను ప్రకటించారు. నిజానికి అభ్యర్థుల ప్రకటన వెనక.. చాలా పరిణామాలు జరిగినట్లు ప్రచారం జరిగింది. రెండు సీట్లలో ఒకటి తమకు ఇవ్వాలని పట్టుపడుతున్నాయని జనసేన, బీజేపీ పట్టు పట్టినట్లు చర్చ జరిగింది. కమలం పార్టీ అయితే ఈ వ్యవహారాన్ని ఢిల్లీ పెద్దల వరకు తీసుకెళ్లిందనే గుసగుసలు వినిపించాయ్. ఐతే ఆ తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయ్. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కూటమి పార్టీలు ఒక్కతాటి మీదకు వచ్చాయ్. దీంతో ఎన్నికల వ్యూహాలు సిద్థం చేసే పనిలో కూటమి ఉంది. పట్టభద్రుల స్థానాలు కావడంతో.. భారీ మెజారిటీతో విజయం సాధించి.. పాజిటివ్ సంకేతాలు పంపాలని ఫిక్స్ అయింది.
ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే..
ఇక అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రేమలేమయ్యాయో.. ఆప్యాయతలేమయ్యాయో అంటూనే.. ఏదో జరిగిందని తెలుసు కానీ.. ఆధారాల్లేవన్న జగన్.. ఆ తర్వాత నుంచి అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించడం వల్లే తాము ఓడిపోయామని వాదిస్తున్నారు.
హరియాణా ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించడంతోనే బీజేపీ గెలవగలిగిందని ట్వీట్ చేశారు. దేశంలో మళ్లీ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించడంపై అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని రాసుకొచ్చారు. ఆయన కోరుకుంటున్నట్లు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరగబోతున్నాయ్. దీంతో ఈ ఎన్నికలలో వైసీపి ఇద్దరు అభ్యర్ధులు ఘన విజయం సాధించి తీరాలి.
లేదంటే జగన్ వాదనల్లో అర్థం లేదని తేలుతుంది. దీంతో వైసీపీ ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంది. నాలుగు నెలల కూటమి పాలనకు.. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు రిఫరెండంగానే మారే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఎన్నికలలో ఓటర్లు అందరూ పట్టభద్రులు. దీంతో టీడీపీ కూటమి ప్రభుత్వం నాలుగు నెలల పాలనకు.. ఈ పట్టభద్ర ఎన్నికలు రిఫరెండంగా భావించవచ్చన్నది చాలామంది మంది అభిప్రాయం. ఓవరాల్‌గా రెండు పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికలు అగ్ని పరీక్షలాంటివే మరి.