AP Bonalu : ఏపీలో తెలంగాణ బోనాలు, సీఎం జగన్‌కు ఆహ్వానం

తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఎంతో ఘనంగా బోనాలు నిర్వహిస్తారు.

AP Bonalu : ఏపీలో తెలంగాణ బోనాలు, సీఎం జగన్‌కు ఆహ్వానం

Ap Bonalu

Updated On : July 3, 2021 / 9:52 PM IST

AP Bonalu : తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఎంతో ఘనంగా బోనాలు నిర్వహిస్తారు. ఈ బోనాలు తెలంగాణ ప్రజల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తాయి. తెలంగాణ బోనాలను ఏపీలోనూ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో బెజవాడలోనూ బోనాలు జరగనున్నాయి. బోనాల కమిటీ ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును కలిసి వినతి పత్రం అందించింది. విజయవాడలో నిర్వహించబోయే బోనాల ఉత్సవాలకు ఏపీ సీఎం జగన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టు కమిటీ వెల్లడించింది.

2010 నుంచి భాగ్యనగర్ బోనాల కమిటీ ఆధ్వర్యంలో ఏపీలోనూ బోనాల వేడుకలు చేపడుతున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు బోనాలు సమర్పించడం ద్వారా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. జులై 18న విజయవాడలో బోనాలు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది. దుర్గమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని బత్తుల బల్వంత్ యాదవ్ నేతృత్వంలోని భాగ్యనగర్ బోనాల కమిటీ మంత్రి వెల్లంపల్లిని కోరింది.

తమ వినతి మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. అలాగే ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ దేవాలయం ఈవో, ఆలయ కమిటీ చైర్మన్లతో పాటు విజయవాడ పోలీసు కమిషనర్, ఏపీ సాంసృతిక శాఖ డైరెక్టర్లను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు వారు తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 30న, పాతబస్తీలోని ప్రధాన దేవాలయాలకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాలని కోరినట్లు వారు తెలిపారు. ప్రతి ఆషాడ మాసం సందర్బంగా అమ్మ వారి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తొందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30న నగరానికి పట్టు వస్త్రాలు తీసుకురావడానికి దేవాలయం ఈవో తమ అంగీకారం తెలిపారన్నారు.

ఇక హైదరాబాద్ లో జూలై 11 గోల్కొండ జగదాంబ అమ్మవారికి నిర్వహించే మొదటి బోనంతో ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ.. అదే రోజు పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు ఉంటుంది. ఆగస్టు 1న నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగనుంది. ఆగస్టు 2న పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపుతో ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగుస్తాయి.