పోతిరెడ్డిపాడుపై సుప్రీంకెళ్లిన తెలంగాణ..

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను నిలిపివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేసింది. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రత్యేకంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నష్టం జరుగుతుందని తమ పిటిషన్‌లో తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకొచ్చింది.
రాయల సీమ ఎత్తిపోతలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్ వాదించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వివాదం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ చేపడుతున్న ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రభుత్వం నిర్మిస్తే రాష్ట్రం ఏడారిలా మారిపోతుందని తెలంగాణలోని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టుపై ముందుకు వెళ్లకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కారణంగా దక్షిణ తెలంగాణలో ఏడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుని రాయలసీమకు సాగునీరు అందించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని భావించింది.
ఈ ఏడాది మే 5వ తేదీన 203వ నెంబర్ జీవో జారీ చేసింది. దీనిపై ముందుగానే తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా నది యజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయడంతో రెండు రాష్ట్రాల అధికారులతో చర్చలు జరిపింది. ఇరువురి వాదనలు విన్న అనంతరం ఈ వివాద అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది.
దీంతో కేంద్ర జలశక్తి శాఖ కూడా అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి తేదీ కూడా ఖరారు చేసింది. ఈ క్రమంలో మంత్రివర్గ సమావేశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 20 తర్వాత అపెక్స్ కౌన్సిల్ పెట్టాలని సూచించడంతో భేటీ జరగలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా ఉండాలని వాదిస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరితా న్యాయస్థానంలో కూడా కేసు ఉంది. మొదట ఈ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లొద్దని ఆదేశించిన ఎన్జీటీ ఆ తర్వాత టెండర్ల ప్రక్రియకు అనుమతినిచ్చింది. ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లను నిలిపివేసేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.