తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత..15వ వార్డులో పోలీసుల లాఠీచార్జ్

ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది.

తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత..15వ వార్డులో పోలీసుల లాఠీచార్జ్

Updated On : March 10, 2021 / 12:02 PM IST

Tirupati Corporation elections : ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు చోట్ల అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. 15వ వార్డు మహాత్మాగాంధీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వైసీపీ నేతలను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడంపై టీడీపీ మహిళా నేతలు అభ్యంతరం తెలిపారు. ఆందోళనకు దిగారు. వైసీపీ, టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 78 లక్షల 71 వేల 272 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2,214 డివిజన్లు, వార్డులకు 7,552 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 75 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అవగా చిత్తూరు జిల్లా పుంగనూరు, కడప జిల్లా పులివెందుల, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి.

దీంతో మిగిలిన 71 మున్సిపాలిటీల్లోని 1,634 వార్డుల్లో పోలింగ్‌ జరగనుంది. 12 కార్పొరేషన్లలో మొత్తం 671 డివిజన్లు ఉండగా వీటిలో 89 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం 7 వేల 552 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. హైకోర్టు తీర్పు కారణంగా ఏలూరు కార్పోరేషన్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొన్నా…. చివరకు పోలింగ్‌కు అనుమతి లభించింది.