రేషన్ తీసుకున్న వారికి రూ. 1000 : ఎవరూ పస్తులు ఉండొద్దు – సీఎం జగన్

ఏపీలో కరోనా రాకాసి విజృంభిస్తుండడంతో సీఎం జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు వైరస్ ను అరికట్టేందుకు చర్యలు తీుసుకొంటూనే..పేదలకు కష్టాలు ఎదురుకాకుండా చూస్తోంది. నిరుపేదలకు రేషన్ సక్రమంగా అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా రేషన్ తీసుకున్న ప్రతొక్కరికీ రూ. 1000 ఇవ్వాలని, ఎవ్వరూ పస్తులు ఉండకుండా చూడాలన్నారు.
ఒకవేళ అర్హత ఉన్న…రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారికి వారంలోగా కార్డులు అందించాలన్నారు. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు, రెడ్ జోన్స్ లో అమలవుతున్న లాక్ డౌన్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కుటుంబ ఆరోగ్య సర్వే సమగ్రంగా నిర్వహించాలని, గ్రామస్థాయిలో మార్కెట్ ఇంటిలిజెన్స్ జరగాలన్నారు.(ఏపీలో మరో 34 కొత్త కరోనా కేసులు నమోదు)
ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్ సదుపాయం అందుబాటులో ఉండాలని, ప్రతి రోగి పట్ల జాగ్రత్తగా వైద్యం అందించే విధంగా చూడాలన్నారు. రిస్క్ ఉన్న కేసులను గుర్తించి పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని ఆదేశించారు. క్వారంటైన్ పూర్తయి ఇంటికి వెళ్లిన వారిపై నిరంతరంగా పర్యవేక్షణ ఉండాలన్నారు. పీపీఈలు నిరంతరం అందుబాటు ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు.