Tirupati Rains : తిరుపతిలో కుండపోత వాన.. భక్తులు ఉరుకులు పరుగులు, స్తంభించిన జనజీవనం
తిరుమల, తిరుపతిలో కుండపోత వాన కురుస్తోంది. తిరుమలలో కురుస్తున్న వర్షాలకు.. శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో కి వరదనీరు వచ్చి చేరింది.

Tpt Rains
Tirupati Heavy Rains : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తిరుమల, తిరుపతిలో కుండపోత వాన కురుస్తోంది. తిరుమలలో కురుస్తున్న వర్షాలకు.. శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో కి వరదనీరు వచ్చి చేరింది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి ప్రమాదం వస్తుందోనని భక్తులు ఉరుకులు పరుగులు పెట్టారు.
Read More : School Bus : చిత్తూరులో వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్.. తృటిలో తప్పిన ప్రమాదం
భక్తులు ఎవరూ లేకపోవడంతో తిరుమల పరిసర ప్రాంతాలు బోసిపోయాయి. మరోవైపు…తిరుమల ఘాట్ రోడ్డులో వరద పోటెత్తింది. దీంతో రాకపోకలను నిలిపివేశారు. ఓ వ్యక్తి కొట్టుకపోతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. తిరుమల ఘాట్‌రోడ్డులో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. రెండవ ఘాట్‌రోడ్డులోని హరిణి సమీపంలో రోడ్డుపై పడ్డాయి. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. హెచ్చరిక బోర్డులనూ ఏర్పాటు చేశారు. మరోవైపు వర్షాలకు బుధవారం నుంచి తిరుమల నడకదారిని మూసివేశారు.
భారీ వర్షాలతో తిరుపతి, మంగళం మధ్య సంబంధాలు తెగిపోయాయి. తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చంద్రగిరి, పాకాల మండలాల్లో వర్ష భీభత్సం సృష్టించింది. నక్కలేరు వాగు ప్రవాహంతో కొత్తనెన్నూరు గ్రామం ప్రమాదంలో చిక్కుకుంది. రామచంద్రాపురం నుంచి తిరుపతికి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More : Rain In Tirupati : తిరుమల ఆగమాగం…ఘాట్ రోడ్డులో నో ఎంట్రీ, ప్రజలు బయటకు రావొద్దు
ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలకు సైతం బంద్ అయ్యాయి. దీంతో మధురానగ్‌లో సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. మధురానగర్‌లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోకాల్లోతు వర్షపునీటిలో నిల్చుని ప్రభుత్వానికి నిరసన తెలిపారు. వర్షపు నీటితో బాధలుపడుతున్న మధురానగర్ ప్రజల కష్టాలు పట్టించుకోండని కోరారు. తిరుపతి బస్టాండ్ నీటమునిగింది. పలు బస్సులు బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. తిరుమల ఘాట్‌రోడ్లలోనూ భారీగా వరద పోటెత్తింది. కరకంబాడి రోడ్డులో గోవిందధామం దగ్గర నడుములోతు నీళ్లు చేరాయి. దీంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.