తిరుపతి – తిరుమల లైట్ మెట్రో రైలు సాధ్యమేనా ?

తిరుపతి – తిరుమల మధ్య లైట్ మెట్రో రైల్ ఆలోచన టీటీడీ మదిలో మెదిలింది. ఆలోచన రావడమే ఆలస్యం.. వెంటనే హైదరాబాద్ మెట్రో బృందానికి కబురు పంపింది. అంతలోనే సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్ వర్క్ కూడా మొదలైంది. వర్క్ స్పీడ్‌గానే ఉంది.. మరి ప్రాజెక్ట్ వర్కవుట్ అవుతుందా..? భౌగోళిక స్వరూపం సహకరిస్తుందా? ఆగమశాస్త్రం ఒప్పుకుంటుందా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అందరి మదిలోను మెదులుతున్నాయి. ఎందుకంటే..తిరుమలలో నెలకొన్న పరిస్థితులే కారణం. ఎత్తైన కొండల మధ్యనుంటుంది తిరుమల.
హైదరాబాద్‌లో రోడ్డు మార్గంలో మెట్రో నిర్మాణం చేపట్టారు. కానీ తిరుమలలో అలా కాదు. నిటారుగా ఉండే కొండలపై పిల్లర్లు వేయాల్సి ఉంటుంది. ఘాట్‌రోడ్లలో అదంత సాధ్యమేనా..? కొండచరియలు విరిగిపడుతూ విఘాతం కలిగిస్తే..? కాలినడకన వెళ్తేనే దైవదర్శనం చేసుకున్నట్టు భావించే భక్తకోటి.. ట్రైన్లలో వెళ్తే సంతృప్తి చెందుతుందా..? ఇన్ని ప్రశ్నల మధ్య మెట్రో ప్రాజెక్ట్ ముందుకెళ్లడం పెద్ద సవాల్‌గానే కనిపిస్తోంది.
తిరుమల కొండను, అడవులను కాలుష్యం నుంచి రక్షించుకోవడానికి రవాణా సౌకర్యాలు మెరుగుపరుచుకోవడం అనివార్యం. భవిష్యత్ తరాలకు ఎంతో మేలు కూడా. ఇందులో భాగంగా మెట్రో సేవలు చాలా అవసరం అనే అభిప్రాయాలున్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు పట్టాలెక్కుతుందన్నది అనుమానంగా మారింది.
ప్రమాదకరమైన మలుపులు తిరుగుతూ వెళ్లే రోడ్లపైనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చినుకుపడితే కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ అవరోధాలను అధిగమించి మెట్రో ప్రాజెక్ట్ ముందుకెళ్తుందా. వీటిని పక్కన పెడితే భక్తుల నుంచి ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. వారి మనోభావాలకు విరుద్దంగా టీటీడీ వెళ్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
దైవ భక్తితో చాలామంది భక్తులు కాలినడకన కొండపైకి వెళ్తారు. దాదాపు 8కిలోమీటర్లు నడుస్తారు. కాళ్లకి బొబ్బలు ఎక్కినా లెక్కచేయరు. కష్టాన్ని లెక్కచేయకుండా పైకి వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరుగుముఖం పడతారు. ఇప్పుడు మెట్రో సేవలు వస్తే కాలినడకన దారి మూసేయడం ఖాయమంటున్నారు భక్తులు.
తమ సెంటిమెంట్‌ను అగౌరవపరచొద్దని టీటీడీకి విఙ్ఞప్తి చేస్తున్నారు. కొండపైకి చేరుకోవాలంటే కాలినడకన వెళ్తేనే సంతృప్తిగా ఉంటుందని చెబుతున్నారు భక్తులు. ఆర్టిఫిషియల్‌గా ట్రైన్‌లో వెళ్తే అంతగా తృప్తి ఉండదంటున్నారు. వెంటనే మెట్రో సేవల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్నారు.
శ్రీవారి ఆలయంలో జరిగే మార్పులు, స్వామివారి పూజలు, కైంకర్యాల్లో ఆగమ శాస్త్రాలను పరిగణలోకి తీసుకుంటారు. ఘాట్ రోడ్డు విషయంలో ఆగమ శాస్త్రాల జోక్యం ఉండకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. దశాబ్దాల క్రితం తిరుమలకు కేవలం అలిపిరి నడకదారి మాత్రమే ఉండేది. నడవలేని భక్తుల కోసం అప్పట్లో ప్రత్యేకంగా డోలీలతో తిరుమలకు చేరవేసి కొందరు ఉపాధిగా మలచుకునేవాళ్లు.
క్రమంగా రద్దీ పెరగడంతో 75 ఏళ్ల క్రితం తిరుమలకు మొదట ఘాట్ రోడ్డు నిర్మించారు. భక్తుల అవసరాల కోసం 1974లో రెండవ ఘాట్ రోడ్డు కూడా నిర్మించారు. ఆగమశాస్త్రాలు అంగీకరించని పక్షంలో అప్పట్లోనే రోడ్లు ఏర్పాటయ్యేవి కాదు. రద్దీకి అనుగుణంగా రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంలో ఆగమ శాస్త్రాల అభ్యంతరం ఉండకపోవచ్చు.
మెట్రో ప్రాజెక్ట్‌కి ఆగమ శాస్త్రాల అభ్యంతరం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే తిరుమల అడవులు రిజర్వు ఫారెస్టు కావడం.. పైగా వైల్డ్ లైఫ్ శాంక్షురీ కావడంతో కేంద్రం అనుమతించకపోవచ్చని సమాచారం. ఇక హైదరాబాద్‌లోనూ మొదట మెట్రో సాధ్యం కాదనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ అడ్డంకుల్ని, అవరోధాలను ఎదురించి మెట్రో పట్టాలెక్కింది. విజయవంతంగా దూసుకుపోతోంది.
ఇప్పుడీ ప్రాజెక్ట్‌పై తిరుపతిలోనూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా.. అవేం పెద్దగా లెక్కలోకి తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇక సాధ్యాసాధ్యాలపై ప్రధానంగా దృష్టి సారించింది హైదరాబాద్ మెట్రో రైల్ బృందం. వాళ్లు ఓకే అంటే.. ప్రాజెక్ట్ ముందుకెళ్లే ఛాన్స్ ఉంది.
Read More : కోడిని చూస్తే చిరాకెందుకు ? : నో చికెన్ అంటున్న నాన్ వెజ్ ప్రియులు