Tragedy Story : అయ్యో పాపం.. టీ తాగుదామని రైలు దిగాడు, 20 ఏళ్లు నరకం చూశాడు.. ఓ వ్యక్తి దీనగాథ..

ఇలా ఒక్కోసారి ఒక్కో విధంగా చెబుతుండటంతో ఏం చేయాలో తెలియక అధికారులు తల పట్టుకున్నారు.

Tragedy Story : అయ్యో పాపం.. టీ తాగుదామని రైలు దిగాడు, 20 ఏళ్లు నరకం చూశాడు.. ఓ వ్యక్తి దీనగాథ..

Updated On : March 5, 2025 / 1:06 AM IST

Tragedy Story : రైలు ప్రయాణం చేస్తూ టీ తాగేందుకు రైలు దిగడం ఓ వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేసింది. 20 ఏళ్లు నరకం అనుభవించేలా చేసింది. వెట్టిచాకిరిలో అతడు మగ్గిపోయాడు. చివరికి 20 ఏళ్లకు బానిసత్వం నుంచి విముక్తి దొరికినా.. తన కుటుంబం ఎక్కడుందో తెలియక తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.

ఆయన పేరు అప్పారావు. పార్వతీపురం మన్యం జిల్లా వాసి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం పని కోసం పుదుచ్చేరికి రైల్లో బయల్దేరాడు. కాగా, దారిలో ఓ రైల్వే స్టేషన్‌లో టీ తాగాలని అనిపించి ట్రైన్ దిగాడు. అదే అతడి జీవితాన్ని తలకిందులు చేశాడు. 20 ఏళ్లు వెట్టిచాకిరి చేయించింది. టీ తాగిన అప్పారావు.. తిరిగి రైలెక్కడానికి వెళ్లాడు. కానీ అక్కడ ట్రైన్ లేదు. దీంతో అప్పారావు భయపడిపోయాడు. తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. చుట్టుపక్కల వారిని అడిగితే రైలు వెళ్లిపోయిందని చెప్పారు. దీంతో అప్పారావుకి దిక్కుతోచలేదు. పోనీ మరో ట్రైన్ లో వెళ్దామంటే దగ్గర ఒక్క పైసా కూడా లేదు.

ఏం చేయాలో అర్థం కాలేదు. తినేందుకు తిండి లేక ఆకలితో అల్లాడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో అప్పారావు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఏం జరిగింది అని ఆరా తీశాడు. నీకు నేను సాయం చేస్తానంటూ నమ్మించాడు. నా దగ్గర పని చేస్తే నీకు డబ్బులు ఇస్తానని అతడు చెప్పాడు. అతడి మాటల నమ్మడమే అప్పారావు కొంప ముంచింది. 20 ఏళ్లు బానిసగా మారాల్సి వచ్చింది. వెట్టి చాకిరి చేయాల్సి వచ్చింది.

అప్పారావుని ఆ వ్యక్తి తమిళనాడులోని శివగంగ జిల్లా కదంబంకుళం ప్రాంతానికి తీసుకెళ్లాడు. గొర్రెల కాపరిగా పెట్టుకున్నాడు. జీతం ఇస్తానని నమ్మించిన అతడు.. ఆ తర్వాత మోసం చేశాడు. కూలి పైసలు ఇవ్వకుండా బలవంతంగా అప్పారావుని ఉంచుకున్నాడు. అక్కడి నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేశాడు. అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 ఏళ్లు జీతం చెల్లించకుండా అప్పారావుతో వెట్టి చాకిరీ చేయించుకున్నాడు.

Also Read : ‘కేజీఎఫ్’ను మించి.. పాకిస్తాన్‌లో రూ.80వేల కోట్ల బంగారం.. ఇకనైనా దశ తిరుగుతుందా?

అయితే, దేవుడి దయో మరో కారణమో కానీ.. తమిళనాడు కార్మిక శాఖ అధికారులు చేపట్టిన వెట్టిచాకిరి నిర్మూలన దాడులతో అప్పారావు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పారావుకి వెట్టి నుంచి విముక్తి లభించింది. ఇప్పుడు అతడి వయసు 60 ఏళ్లు. అప్పారావుతో మాట్లాడిన అధికారులు అతడి వివరాలు తీసుకున్నారు. తనది పార్వతీపురం మండలం జమ్మవలస అని అధికారులతో చెప్పాడు అప్పారావు. దీంతో తమిళనాడు కార్మిక శాఖ అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. అప్పారావు ఫోటో పంపి వివరాలు తెలియజేశారు. వెంటనే కలెక్టర్ పోలీసులకు వివరాలు తెలిపి.. అప్పారావు కుటుంబం గురించి తెలుసుకోవాలని ఆదేశించారు.

కలెక్టర్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అప్పారావు కుటుంబం వివరాలు కనుగొనే ప్రయత్నం చేశారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. అతడి కుటుంబం గురించి వివరాలు తెలియలేదు. దీంతో జిల్లాలోని మిగతా గ్రామాల్లో అప్పారావు కుటుంబం ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అప్పారావు కుటుంబం గురించి తెలిసిన వాళ్లు తమకు సమాచారం ఇవ్వాలన్నారు.

ప్రస్తుతం అప్పారావు తమిళనాడులోని శివగంగ జిల్లాలోని ఓల్డేజ్ హోమ్ లో ఆశ్రయం పొందుతున్నారు. 20 ఏళ్లు ఒంటరిగా ఉండటం, ఎవరితోనూ మాట్లాడకపోవటం కారణంగా అప్పారావు మాటలు స్పష్టంగా లేవని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు.. అప్పారావు తన గతాన్ని మరిచిపోయి ఉంటాడనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

నీది ఏ ఊరు అని అధికారులు అడిగితే.. నాది పార్వతీపురం సమీపంలోని జమ్మిడివలస అని ఒకసారి చెప్పాడు అప్పారావు. అంతలోనే ఒడిశాలోని కొరపుట్ జిల్లా అలమండ మండలంలోని జమ్మడవలస అని మరోసారి చెప్పాడు. అదే మండలంలోని జంగిడివలసని ఇంకోసారి చెప్పాడు. ఇలా ఒక్కోసారి ఒక్కో విధంగా చెబుతుండటంతో ఏం చేయాలో తెలియక అధికారులు తల పట్టుకున్నారు. అయినప్పటికీ.. అధికారులు తమ ప్రయత్నాలు ఆపలేదు.
అప్పారావు కుటుంబసభ్యుల వివరాలు తెలుసుకునేందుకు తమిళనాడు, ఏపీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.