Pakistan Gold : ‘కేజీఎఫ్’ను మించి.. పాకిస్తాన్‌లో రూ.80వేల కోట్ల బంగారం.. ఇకనైనా దశ తిరుగుతుందా?
Pakistan Gold : పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్‌లో భారీగా బంగారు నిల్వలు బయటపడ్డాయి. ఈ బంగారం విలువ 80వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు పాకిస్తాన్ ఈ బంగారాన్ని వెలికితీసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Pakistan finds gold
Pakistan Gold : పాకిస్తాన్ పంట పడింది. భారత్ గుండా ప్రవహించే సింధు నది పాకిస్తాన్‌కు వరంలా మారింది. టన్నుల కొద్ది బంగారం బయటపడుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. కేజీఎఫ్‌కు మించిన బంగారం. అందుకే ఈ బంగారం నిక్షేపాలపై పాకిస్తాన్ కన్నేసింది. దయాది దేశం ఎలాగైనా ఈ బంగారు గనిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. పురాతన కాలంలో ఉద్భవించిన ఈ నది సింధు లోయలో టన్నుల కొద్ది బంగారు నిక్షేపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
రూ. 80వేల కోట్ల విలువైన బంగారు నిల్వలు :
ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ బంగారు నిధిని వెలికితీసేందుకు పెద్ద ప్లాన్ వేసింది. ఆ దేశ ప్రభుత్వ సర్వే ప్రకారం.. నదీ లోయలో వందల బిలియన్ల విలువైన బంగారు నిల్వలు ఉన్నాయి. ఈ బంగారు నిక్షేపాల విలువ దాదాపు రూ. 80వేల కోట్లు ఉంటుందని అంచనా. పంజాబ్ ప్రావిన్స్‌లోని అట్టాక్ జిల్లాలో ప్రభుత్వం నియమించిన సర్వే సందర్భంగా ఇది వెలుగులోకి వచ్చిందని పలు మీడియా నివేదికలు సూచించాయి.
ఎప్పుటినుంచో ఆర్థికంగా వెనుకబడిన పాకిస్తాన్‌కు ఈ బంగారు నిక్షేపాలు బయటపడటం పెద్ద జాక్‌పాట్ తగిలినట్టే. భవిష్యత్తులో దేశానికి ఈ బంగారమే ఆర్థికంగా జీవనాధారంగా మారనుంది. దీనికి సంబంధించి అన్వేషణలో ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పాకిస్తాన్ (NESPAK) అలాగే పంజాబ్‌లోని గనులు, ఖనిజాల శాఖ నాయకత్వం వహించాయి.
బంగారు నిక్షేపాలను తవ్వేందుకు సన్నాహాలు :
బంగారం వెలికితీతకు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. అటాక్ ప్లేసర్ గోల్డ్ ప్రాజెక్ట్ కోసం నేషనల్ ఇంజనీరింగ్ సర్వీస్ ఆఫ్ పాకిస్తాన్ (NESPAK), పంజాబ్ ప్రావిన్స్ గనులు, ఖనిజాల శాఖ చేతులు కలిపాయి. ఈ సమాచారాన్ని (NESPAK) మేనేజింగ్ డైరెక్టర్ జర్గామ్ ఇషాక్ ఖాన్ ధృవీకరించారు.
పాకిస్తాన్ మీడియా నివేదికలలో దేశ మైనింగ్ రంగంలో ఒక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. అటాక్ జిల్లాలోని సింధు నది వెంబడి 9 ప్లేసర్ బంగారు బ్లాకులకు బిడ్ పత్రాల తయారీ, కన్సల్టెన్సీ సర్వీసెస్, లావాదేవీ సలహా సేవల కోసం ప్రభుత్వ యాజమాన్యంలోని కన్సల్టెన్సీ ఒప్పందంపై సంతకం చేసిందని పాకిస్తాన్ మీడియా సంస్థ నివేదించింది.
ఈ బంగారు నిల్వల ద్వారా ప్రపంచ మైనింగ్ పరిశ్రమలో పాకిస్తాన్ కీలక పాత్రధారిగా నిలిపే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. సింధు నది భారత్‌లోని హిమాలయాల నుంచి ఈ బంగారు నిక్షేపాలను పాకిస్తాన్ తరలించనుంది. ఆ దేశం బంగారుమయంగా మారనుందని భూగర్భ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
బంగారం నిల్వల దోపిడీ :
చారిత్రాత్మకంగా సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న సింధు లోయ ప్రాంతం చాలా కాలంగా బంగారం, ఇతర విలువైన లోహాలతో ముడిపడి ఉంది. ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయనే ఊహాగానాలపై స్థానిక మైనింగ్ కాంట్రాక్టర్లు ఇప్పటికే భారీగా తరలివచ్చారు. దాంతో పంజాబ్ ప్రావిన్షియల్ ప్రభుత్వం జోక్యం చేసుకుని అనుమతులు లేకుండా తవ్వకాలకు అనుమతి నిరాకరించింది.
ఈ ఏడాదిలో పాకిస్తాన్ నివేదిక ప్రకారం.. పంజాబ్‌లోని అటాక్ సమీపంలో రూ. 800 కోట్ల బంగారు నిల్వ ఉంది. పాకిస్తాన్ నేత సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత నుంచి అటాక్‌కు దగ్గరగా ఉన్న ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని నౌషెరా సమీపంలోని సింధు నది లోయలో బంగారం దోపిడీ మొదలైంది. చాలా మంది మైనింగ్ కాంట్రాక్టర్లు తమ బృందాలతో అక్కడికి చేరుకుంటున్నారు.
అయితే, పంజాబ్‌లో మైనింగ్‌కు అనుమతి లేకపోవడంతో, ఇక్కడ ఇంకా తవ్వకాలు ప్రారంభించలేదు. సింధు నది హిమాలయాల నుంచి బంగారాన్ని తరలించి పాకిస్తాన్‌లో నిక్షిప్తం చేస్తుందని అంటున్నారు. దీనిని ప్లేసర్ గోల్డ్ అంటారు. నదిలో లభించే బంగారు ముక్కలు గుండ్రంగా ఉంటాయి. ఈ నదిలో బంగారం చాలా దూరం విస్తరించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.